Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ కాస్ట్‌తో తెరకెక్కుతున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్‌పై రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్‌పై ఓ ఇంట్రెస్టింగ్ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజమౌళితో పాటు మరో దర్శకుడు కూడా ‘వారణాసి’ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. అయితే ఆయన ప్రధాన సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. ‘వారణాసి’ ఎలా రూపుదిద్దుకుంటోంది? రాజమౌళి టీమ్ ఎలాంటి కష్టపడుతోంది? నటీనటులు ఎలాంటి వర్క్‌షాప్స్‌కు హాజరయ్యారు? భారీ సెట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఎలా తెరకెక్కుతున్నాయి? వంటి అంశాలను చూపించే ప్రత్యేక మేకింగ్ డాక్యుమెంటరీని రూపొందించే బాధ్యతను ఆయన తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మేకింగ్ డాక్యుమెంటరీ కోసం జార్జియాకు చెందిన దర్శకుడు గోగితా చిక్వాడ్జేను ఎంపిక చేసినట్లు సమాచారం. డాక్యుమెంటరీ చిత్రీకరణలో అనుభవం ఉన్న ఆయన.. ‘వారణాసి’ ప్రీ-ప్రొడక్షన్ దశ నుంచే తన కెమెరాలతో ఈ ప్రయాణాన్ని రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నటీనటుల వర్క్‌షాప్స్, పాత్రల కోసం వారు చేస్తున్న ప్రత్యేక శిక్షణ, భారీ సెట్స్ నిర్మాణం, షూటింగ్ ప్రక్రియ, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ వంటి అనేక కీలక అంశాలను ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నట్లు సమాచారం. సాధారణంగా సినిమా విడుదలకు ముందు లేదా షూటింగ్ చివరి దశలో మేకింగ్ వీడియోలను రూపొందిస్తుంటారు. కానీ ‘వారణాసి’ విషయంలో మాత్రం సినిమా రూపకల్పన ప్రారంభమైనప్పటి నుంచే మేకింగ్‌ను డాక్యుమెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజమౌళి ఆలోచనా విధానం, ప్రీ-ప్రొడక్షన్లో ఆయన చేసే ప్లానింగ్, నటీనటుల ప్రిపరేషన్, భారీ స్థాయిలో విజువల్స్‌ను రూపొందించే విధానం వంటి విషయాలను ప్రేక్షకులు మరింత దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది.
రాజమౌళి సినిమాల మేకింగ్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించిన మేకింగ్ కంటెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన మేకింగ్ వీడియోలు, షూటింగ్ విశేషాలు కూడా సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ‘వారణాసి’ మేకింగ్ డాక్యుమెంటరీని మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా వెనుక ఉన్న అసలు శ్రమను, రాజమౌళి విజన్‌ను, అంతర్జాతీయ స్థాయిలో ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్న విధానాన్ని ఇందులో చూపించనున్నట్లు సమాచారం. ‘వారణాసి’ కేవలం భారతీయ మార్కెట్‌ను మాత్రమే కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న సినిమా కావడంతో.. మేకింగ్ డాక్యుమెంటరీకి కూడా గ్లోబల్ స్థాయిలో మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని చిత్ర వర్గాలు భావిస్తున్నట్లు టాక్. సినిమా డిజిటల్ హక్కులతో పాటు మేకింగ్ డాక్యుమెంటరీని కూడా ప్యాకేజీలో భాగంగా చేసే ఆలోచనపై చర్చలు జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.