Hyderabad | హైదరాబాద్ బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య వెలుగుచూసింది. బిస్మిల్లా కాలనీలో 21 ఏళ్ల యువతి రెహానా కత్తిపోట్లకు గురై మృతి చెందింది. ఆమెను ప్రేమించిన మహ్మద్ సలామ్ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. హత్య అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి తరలించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బిహార్‌కు చెందిన రెహానా పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో నివాసం ఉంటూ ఓ ఫంక్షన్ హాల్లో పనిచేస్తోంది. అదే ఫంక్షన్ హాల్లో పనిచేసే మహ్మద్ సలామ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు మొదలైనట్లు సమాచారం. పెళ్లి చేసుకోవాలని రెహానా సలామ్‌పై ఒత్తిడి తెచ్చినట్లు.. మరో యువకుడితో ఆమె సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో సలామ్ ఆమెపై కోపం పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవ సమయంలో రెహానాపై సలామ్ కత్తితో దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
హత్యలో సలామ్తోపాటు మరో ఇద్దరి పాత్ర ఉందా? మృతదేహాన్ని తరలించేందుకు వారు సహకరించారా? హత్య ముందస్తు ప్రణాళికతో జరిగిందా? లేక గొడవలో క్షణికావేశంతో దాడి చేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.