‘ఇత్తేసి పొత్తు గూడినోళ్లు ఇడిసిపోయినా తెగుతలేదు నీళ్ల పంచాయితీ’. అటు గోదావరిని తెలంగాణ పీఠమెక్కించిన కాళేశ్వర మహోన్నత ప్రస్థానం ప్రమాదంలో పడింది. బీఆర్ఎస్ పాలనలో పచ్చబడ్డ తెలంగాణ జలవైభవం కాంగ్రెస్ చేతగానితనంతో కల్లోలమైంది. ప్రాజెక్టులను పడావుబెట్టి, పొరుగు దోపిడీకి అండగా నిలిచే ఇంటిదొంగల పాలనలో పోరుగడ్డ కథ మళ్లీ మొదటికొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతలగా ప్రశంసలు పొందిన కాళేశ్వరాన్ని పండబెట్టి, మన పొలాలను ఎండబెట్టి పొరుగు బాబుల పోలవరానికి కాపుగాసే తలకిందుల ఆలోచనలు రాజ్యమేలుతున్నాయి. ఎగువ నది గోదావరిని ఎగరేసుకుపోతుంటే ఇగిలించిన నాయకులు దిగువ నది కృష్ణనైనా దక్కనిస్తారని అనుకుంటే పొరబాటే అని జూరాల సాక్షిగా తేలిపోయింది. నదీ పరీవాహక సూత్రం గంగలో కలిసిపోయింది. ఎగువ రాష్ర్టాల అవసరాలకే పెద్దపీట వేయడం ఆచారం. ఎగువనున్న కర్ణాటక ప్రాజెక్టులు నిండుగా కళకళలాడుతున్నాయి. దిగువనున్న ఆంధ్రాలో కృష్ణాజలాలను కుప్పపోసుకుంటున్నారు. మధ్యలో మనమే దాహం దాహం అనే దుస్థితిలోకి నెట్టివేయబడ్డాం.
పొరుగు రాష్ర్టాలు బాహాటంగా కృష్ణాజలాలను తరలించుకుపోతుంటే, సోయిలేని మన పాలకులు సోదిమాటలతో కాలక్షేపం చేస్తున్నారు. జూరాల నుంచి పంట పొలాలకు పారించకుండా నీటిని దిగువకు ఇడిసిపెడుతుంటే, అక్రమ ప్రాజెక్టులతో ఏపీ ఒడిసి పడుతున్నది. శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంనకు కృష్ణా జలాలను పారించుకుని పొరుగుబాబులు ఊరేగుతుంటే, తెలంగాణ సర్కార్ ప్రాజెక్టులకు పోలీసు కాపలా పెట్టి సహకరిస్తున్నది. ఏనుగు కొనెల్లి తోకజిక్కిన పాలమూరు ప్రాజెక్టు మిగులు పనులను పూర్తిచేయడం మాట దేవుడెరుగు ఉన్న జూరాల నుంచే నీరు పారించకుండా అన్నదాతలను అరిగోస పెడుతున్నది. కాళ్లావేళ్లా పడ్డా కరుణించలేదు. దాంతో కడుపు మండిన కర్షకలోకం బీఆర్ఎస్ నాయకత్వాన కదం తొక్కింది. గద్వాలలో 6 గంటలపాటు రైతులు రాస్తారోకో నిర్వహించారు. కలెక్టరేట్‌ను ముట్టడించారు. రైతన్నలకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. గేట్లు ఎత్తేందుకు రైతులు చలో జూరాల అని తిరుగబడితే పోలీస్ లాఠీలతో సర్కార్ అణచివేయ చూడటం దుర్మార్గం.
అసలు నీళ్లు ఎందుకు ఇవ్వరని నిలదీస్తే.. కాంగ్రెస్ సర్కార్ పూటకో మాటతో తప్పించుకోజూస్తున్నది. ఎల్ నినో పేరు చెప్పి ప్రకృతి మీదికి నెపం నెడుతున్నది. ఇలా వాదించడమంటే బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టడమే. ఎల్ నినో తెలంగాణకు, ఏపీకి ఒకటే కావచ్చు. కానీ ఇక్కడ సమస్య కృష్ణాజలాలు. ఈ ఏడాది కృష్ణానదికి 318 టీఎంసీల వరద వస్తే ఇందులో ఏపీ 84 టీఎంసీల వరకు వాడుకున్నది. తెలంగాణ అందులో దాదాపు సగం, అంటే 47 టీఎంసీలే వాడుకోవడం విడ్డూరం. ఇక జూరాలకు 243 టీఎంసీల వరద వస్తే వివిధ లిఫ్టుల ద్వారా తెలంగాణ వాడుకున్నది 20 టీఎంసీలే. ఇప్పటివరకు ఎల్ నినో తెలంగాణకు ఎంత నష్టం కలిగించిందో ఏపీకి అంతే నష్టం కలిగించింది. వర్షాలు అంతంతమాత్రమే కురువడంతో తెలంగాణలో చెరువులు నిండలేదు. పెద్ద ఎత్తున పంటలు ఎండుతున్నాయి. అయినా రేవంత్ సర్కార్ కృష్ణా జలాలను పక్కరాష్ర్టానికి ధారపోసే వైపరీత్యానికి ఒడిగడుతున్నది.
ఇది ఈనాటి కథ కాదు. ఆధునిక దేవాలయం అంటూ ఆకాశానికెత్తిన నాగార్జునసాగర్‌ను దిగువకు దింపి, ఏపీకి ఎక్కువ నీళ్లను వంపిన పాచికలతోనే కుట్ర మొదలైంది. మద్రాస్ దాహార్తిని తీర్చేందుకు అంటూ మొదలుపెట్టిన తెలుగుగంగ ప్రాజెక్టును రాయలసీమ మొత్తం తిప్పుతున్నారు. కేటాయింపులు లేని, అనుమతులు లేని ప్రాజెక్టులతో నీటిని ఎత్తిపోసుకుంటూ తబేద్ మనాయించారు ఆంధ్రా పాలకులు. తెలంగాణ సోయిలేని కాంగ్రెస్ నాయకత్వం గంగిరెద్దులా తలూపుతూ ఆ జలదోపిడీకి వంతపాడుతూ వచ్చింది. ఇప్పుడు గురుశిష్యుల సయ్యాటతో అది పరాకాష్టకు చేరింది. అయితే ఈ దొంగాటకాలు ఎంతోకాలం చెల్లవు. కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్న బూటకాలు ఇంకానా, ఇకపై సాగవని రైతులు గర్జిస్తున్నారు. చేవలేని, చేతకాని అణచివేతే తమ సమాధానమని సర్కార్ అంటున్నది. అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకోకముందే సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. కృష్ణాజలాలను ఎత్తిపోసి పొలాలకు పారించాలి. లేకపోతే రైతుల ఆగ్రహం తుపానై చుట్టుముట్టి, అసమర్థ పాలనను మట్టుపెట్టే పరిస్థితి వస్తుందని గుర్తుంచుకోవాలి.