హైదరాబాద్ : ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది(KCR) అయితే.. ప్రచారం కాంగ్రెస్‌ది అన్నట్లు ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చినట్టే.. కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ (TIMS) హాస్పిటల్స్ ప్రారంభోత్సవాల పేరుతో కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. నేడు సనత్‌నగర్‌లోని(Santhnagar) టిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవంపై ఆయన స్పందించారు. డేట్లు, డెడ్లైన్లు మార్చుకుంటూ పోయి, చివరకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్న దవాఖానలో కూడా పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురాకపోవడం శోచనీయమన్నారు. వెయ్యి కోట్ల రూపాయలతో నిర్మించిన హాస్పిటల్‌ను కేవలం ఓపీ సేవలకే పరిమితం చేయడం సిగ్గుచేటన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పేరు మార్చినంత సులువుగా హాస్పిటల్ కట్టిన చరిత్ర మార్చలేవన్నారు. హైదరాబాద్‌కు మూడు వైపులా మూడు టిమ్స్ హాస్పిటల్స్ (అల్వాల్, సనత్‌నగర్, ఎల్బీనగర్) ఏర్పాటు చేసి, పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్నది కేసీఆర్ ఆలోచన. కరోనా తర్వాత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వందేళ్ల ముందు చూపుతో కేసీఆర్ TIMSలకు రూపకల్పన చేశారన్నారు. 2022 ఏప్రిల్ 26న ఒకేరోజు మూడు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ దవాకానలకు శంకుస్థాపన చేసి చరిత్ర సృష్టించారు. ప్రణాళిక కేసీఆర్‌ది.. శంకుస్థాపన కేసీఆర్‌ది.. నిధులు విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది
ఒక్కో ఆసుపత్రి వెయ్యి పడకల సామర్థ్యంతో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) పేరుతో నిర్మించే మూడింటి నిర్మాణానికి రూ.2,679 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో శరవేగంగా సాగిన పనులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నత్తనడకన సాగాయి. సకాలంలో పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మూడున్నరేళ్ల సుదీర్ఘ కాలంలో పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించకుండా, కేవలం ప్రచారం కోసం నేడు TIMS సనత్‌నగర్‌ను ప్రారంభిస్తున్నారు. కనీసం హాస్పిటల్‌కు నీటి సరఫరా కూడా కల్పించలేదు అంటే పేదల వైద్యం పట్ల వీరికి ఉన్న శ్రద్ధ ఏమిటో అర్థం అవుతుంది.
ఉచితంగా వైద్య సేవలు అందించాలి
కేసీఆర్ పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆలోచిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేదల నుంచి ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కండ్లు తెరవండి. కేసీఆర్ ఎంతో ముందుచూపుతో మొదలు పెట్టిన టిమ్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పేదల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.