IND vs ENG : లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. టీమిండియా బౌలర్ల విజృంభణతో రెండో ఇన్నింగ్స్‌లో ఆది నుంచి తడబడుతున్న ఇంగ్లండ్ ఆలౌట్ అంచున నిలిచింది. లంచ్ బ్రేక్ వరకూ పటిష్ట స్థితిలోనే ఉన్న ఆతిథ్య జట్టు ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (2-13) రాకతో కీలక వికెట్లు కోల్పోయింది. కొరకరాని కొయ్యలా మారిన జో రూట్(40)ను బౌల్డ్ చేసిన వాషీ.. విధ్వంసక బ్యాటర్ జేమీ స్మిత్(8)ను కూడా క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్(27 నాటౌట్) టెయిలెండర్లతో కలిసి ఎంత సేపు పోరాడతాడనేది చూడాలి. ఇంగ్లండ్‌ను 200లోపు ఆలౌట్ చేస్తే గిల్ సేన విజయం తలుపు తట్టినట్టే.
నాలుగో రోజు తొలి సెషన్ నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్న టీమిండియా మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరింది. తొలి సెషన్లో సిరాజ్ ధాటికి ఓపెనర్ బెన్ డకెట్(12), ఓలీ పోప్(4)లు పెవలియన్ చేరగా.. జాక్ క్రాలే(22)ను నితీశ్ ఔట్ చేశాడు. లంచ్‌కు ముందు డేంజరస్ హ్యారీ బ్రూక్(23)ను బౌల్డ్ చేసిన ఆశాశ్ దీప్ ఇంగ్లండ్‌కు షాకిచ్చాడు. కీలక బ్యాటర్లు ఔటైనా.. కెప్టెన్ స్టోక్స్(27 నాటౌట్)తో కలిసి జో రూట్(40) స్కోర్ 150 దాటించాడు.
It’s Tea Break at Lord’s on Day 4!
2⃣ wickets in the second session for #TeamIndia 👌👌
Final session coming up 🔜
Updates ▶️ https://t.co/X4xIDiSmBg#ENGvIND pic.twitter.com/DLoL6gq5Xx
— BCCI (@BCCI) July 13, 2025
భారత బౌలర్లను విసిగిస్తూ ఐదో వికెట్‌కు 67 పరుగులు జోడించిన ఈ ద్వయాన్ని ఎట్టకేలకు సుందర్ విడదీశాడు. స్వీప్ షాట్ కొట్టే యత్నంలో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు రూట్. దాంతో, 154 వద్ద ఇంగ్లండ్ సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం వచ్చిన జేమీ స్మిత్ (8)ను కూడా సుందర్ బౌల్డ్ చేయగా ఇంగ్లండ్ ఆలౌట్ అంచున నిలిచింది. క్రిస్ వోక్స్(8 నాటౌట్) తో కలిసి వికెట్ పడకుండా ఆడిన స్టోక్స్ ఎంతవరకూ ప్రతిఘటిస్తాడో చూడాలి. రెండో సెషన్లో ఇంగ్లండ్ 77 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. టీ సమయానికి స్కోర్.. 175-6.