ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ శివారులోని కొమురం భీం చౌరస్తా వద్ద డివైడర్ను ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం… జన్నారం మండలం ఇందన్ పల్లి గ్రామానికి చెందిన చొప్పదండి లక్ష్మణ్ (25), పడిగల జశ్వంత్ (19)లు పల్సర్ బైక్ పై లక్ష్మణ్ పెళ్లి పత్రికలు పంచడానికి ఇందన్ పల్లి నుంచి నిర్మల్ వైపు వెళుతున్నారు.
కొమరం భీం చౌరస్తా మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొని చెట్ల పొదల్లోకి దూసుకు వెళ్లింది. ఇద్దరికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. వారం రోజుల్లో పచ్చని పందిరిలో పెళ్లి పీటలపై ఉండవలసిన వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జస్వంత్ తల్లి భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖానాపూర్ సీఐ అజయ్, ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు.