Iran War : ఇరాన్ యుద్ధం ప్రభావం ఇండియాలోని చమురు సరఫరా, ధరలపైనే కాదు.. ఔషధాల తయారీ, సరఫరాపై కూడా పడుతోంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మందుల ధరలు 10-15 శాతం పెరిగాయని ఔషధ రంగ వ్యాపారులు చెబుతున్నారు. ఈ యుద్ధం ఇంకా కొనసాగితే ధరలు పెరగడమే కాకుండా, మందుల లభ్యత కూడా తగ్గిపోతుందని ఫోప్ (ద ఫెడరేషన్ ఆఫ్ ఫార్మ ఎంట్రప్రెన్యూర్స్) తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఫోప్ కోరింది.
లేకుంటే దేశంలో ఔషధాల తయారీ, ధరలపై తీవ్ర ప్రభావం తప్పదని హెచ్చరిస్తోంది. ఇప్పటికే హోల్‌సేల్ ధరలు 10-15 శాతం పెరిగినట్లు వెల్లడించింది. నిజానికి ఇండియాను ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. ప్రపంచానికి ఔషధాల్ని అందిస్తుందని దీని అర్థం. ప్రపంచంలో 20 శాతం జెనరిక్ ఔషధాల్ని ఇండియానే ఉత్పత్తి చేస్తుంది. అయితే, దీనికి కావాల్సిన ముడి సరుకు 70 శాతం చైనా నుంచే అందుతుంది. అలాగే యాంటీ బయాటిక్స్ కోసం 87 శాతం చైనాపైనే ఆధారపడాల్సి ఉంది. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఈ సరుకు రవాణా జరిగే సముద్ర మార్గాలు మూసుకుపోయిన సంగతి తెలిసిందే. హోర్ముజ్ జలసంధి సహా, ఎర్ర సముద్రం, సూయెజ్ కెనాల్ వంటి మార్గాల్లో రవాణా కష్టతరంగా మారింది. చాలా వరకు కార్గో వాహనాలు సముద్ర మార్గంలో చిక్కుకుపోయాయి. ఇంతకుముందు 20 రోజుల్లో జరిగే రవాణా ఇప్పుడు 45-50 రోజులు పడుతోంది.
దీంతో రవాణా ఛార్జీలు ఐదు రెట్లు పెరిగాయి. కంటైనర్‌కు 3,000 డాలర్ల నుంచి 5,000 డాలర్ల వరకు యుద్ధానికి సంబంధించిన సర్ ఛార్జీలు కూడా విధిస్తున్నారు. ఇదే సమయంలో ఇండియన్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు తక్కువ మొత్తంలోనే స్టాక్ నిల్వ చేసుకుంటున్నాయి. ఔషధాల తయారీలో వాడే పీవీసీ కాంపౌండ్స్, బాటిల్స్, ఫిల్మ్, ఫాయిల్స్ వంటి ధరలు పెరిగాయి. ఇలాంటి అనేక పరిణామాల నేపథ్యంలో ఔషధాల తయారీ, సరఫరా ఖర్చులు పెరిగితే, మందుల ధరలు కూడా పెరుగుతాయి. అందుకే ప్రభుత్వం జోక్యం చేసుకుని ముడి సరుకు రవాణా, సరఫరాకు తగిన చర్యలు తీసుకోవాలని ఫోప్ కోరుతోంది.