Govt land | దుండిగల్, జూలై 13 : గండి మైసమ్మ -దుండిగల్ మండల పరిధిలో పనిచేసే వివిధ విభాగాలకు చెందిన పలువురు అధికారుల పనితీరు వివాదాస్పదంగా మారుతుంది. ప్రధానంగా రెవెన్యూ, మునిసిపల్ అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులకు సేవలందించే విషయంలో సవాలక్ష కొర్రీలు పెట్టే అధికారులు బడాబాబులు, రాజకీయ పలుకుబడి కలిగిన వారి విషయంలో మాత్రం నిబంధనలను తోసిరాజని మరి స్వామి భక్తిలో తరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు ఉదాహరణగా బౌరం పేట గ్రామ పరిధిలోనీ సిల్వర్ ఓక్స్ స్కూల్ నుంచి నిర్మిస్తున్న రోడ్డు వెడల్పు పనులు ఇందుకు ఉదాహరణగా తెలుస్తుందని అంటున్నారు.
ఇందులో అధికారుల స్వామి కార్యంతోపాటు స్వకార్యం కూడా దాగి ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏకంగా ప్రైవేటు వెంచర్ కోసం ప్రభుత్వ నిధులను వినియోగించేందుకు మాస్టర్ ప్లాన్ వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే సదరు రోడ్డు నిర్మాణంతో తమకేమీ సంబంధం లేదని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నప్పటికీ రెవెన్యూ విభాగం నుంచి సర్వేయర్ సర్వే చేసిన తర్వాతనే, మున్సిపల్ అధికారులు తమకు అనుకూలమైన కొందరు రైతులకు నోటీసులు జారీ చేసి ఎన్ఓసీలు తీసుకుని, రోడ్డు నిర్మాణానికి కొలతలు కూడా ఇవ్వడంతోపాటు సిబ్బందిని దగ్గర ఉంచి మరి నిర్మాణ పనులు చేయిస్తున్నారని కొందరు స్థానికులు పేర్కొంటున్నారు. ఇందులో నిజానిజాలు ఏమిటో వారి అంతరాత్మలకు తెలుసునని కూడా స్పష్టం చేస్తున్నారు.
ప్రైవేటు వెంచర్ కోసం ప్రభుత్వ భూమిలో రోడ్డు నిర్మాణం..
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి , బౌరంపేటలో కొందరు ప్రైవేటు వ్యక్తులు హెచ్ఎండిఏ వెంచర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే నిబంధన ప్రకారం హెచ్ఎండిఏ వెంచర్ కు అనుమతులు రావాలంటే కనీసం 40 ఫీట్ల అప్రోచ్ రోడ్డు ఉండాల్సి ఉంటుంది. దీంతో వెంచర్ నిర్వాహకులు అధికారులను మచ్చిక చేసుకుని గతంలో బండ్లబాటగా ఉన్న దారిని 40 ఫీట్ల వెడల్పు రోడ్డుగా నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అడిగింది తడువుగా సుమారు రెండు కిలోమీటర్ల పాటు బండ్లబాటకు ఇరువైపులా ఉన్న రైతులకు మున్సిపల్ చట్టం ప్రకారం నోటీసులు అందజేయడంతోపాటు నయానో.. భయానో వారిని ఒప్పించి ఆగమేగాల మీద రోడ్డు నిర్మాణ పనులు మొదలుపెట్టారు.
అయితే అదే మున్సిపల్ చట్టం ప్రకారం నిర్జన ప్రదేశంలో అవసరం లేని చోట రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకూడదనే నిబంధన సైతం ఉందనే విషయాన్ని సైడ్ చేశారు. అయినప్పటికీ రోడ్డు మధ్యలో సర్వేనెంబర్ 166 ప్రభుత్వ భూమి ఉండగా, అందులో నుంచి సుమారు అర కిలోమీటర్ మేర రోడ్డు వేస్తుండడం వివాదాస్పదంగా మారింది. ప్రైవేటు వెంచర్ కోసం అధికారులు చేసిన సాహసం ఈ నోట ఆ నోట జిల్లా జాయింట్ కలెక్టర్‌కు చేరడంతో ఆయన ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు శనివారం సాయంత్రం రోడ్డు పనులు నిలిపివేయించి డ్రెంచ్ కొట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం ఈ విషయంలో ఇరు శాఖలకు చెందిన అధికారులు రోడ్డు నిర్మాణంలో తమ ప్రమేయం లేదంటే, తమ ప్రమేయం లేదని పనిలో పడ్డట్టు తెలుస్తోంది. నిజానికి ఎవరి ప్రమేయం లేకుంటే రోడ్డు విషయంలో సర్వే నిర్వహించింది ఎవరు…? రోడ్డుకు కొలతలు ఏర్పాటు చేయడంతోపాటు రైతులకు నోటీసులు అందజేసింది ఎవరు..? అనే విషయంలో అధికారుల వైఖరి తేటతెల్లమవుతుందని పలువురు పేర్కొంటున్నారు.
రోడ్డు నిర్మాణం విషయంలో మాస్టర్ ప్లానే..
కాగా బండ్లబాటను 40 ఫీట్ల రోడ్డుగా వెడల్పు చేయడంలో పెద్ద ప్లానే ఉన్నట్టు స్థానికులు పేర్కొంటున్నారు. రోడ్డులో కలిసిన రైతుల భూములకు హెచ్ఎండీఏ నుంచి టీడీఆర్ నిధులను పరిహారంగా ఇప్పించేలా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇక రోడ్డు నిర్మాణం ఖర్చు ప్రైవేటు వెంచర్ నిర్వాహకులే చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. మరి అలాంటప్పుడు ప్రైవేటు వెంచర్ కోసం టీడీఆర్ పరిహారం నిధులను రైతులకు అందజేస్తే ప్రభుత్వం నష్టపోయినట్లు కాదా..? అనేవారు లేకపోలేదు. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద మతలబె దాగి ఉందని పలువురు పేర్కొంటున్నారు.
పచ్చని చెట్లపైన తప్పని వేటు…
రోడ్డు నిర్మాణ పనుల్లో ప్రకృతి ధ్వంసం అవుతుంది అని పలువురు రైతులు పేర్కొంటున్నారు. రోడ్డు వెడల్పులో భాగంగా ఇరువైపులా ఉన్న పెద్ద పెద్ద చెట్లను తొలగించడంతోపాటు విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓ రైతుకు చెందిన బోరుబావి సైతం రోడ్డులో ఉండడం గమనార్హం. ఈ విషయమై మతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పలువురు కోరుతున్నారు.
Protest | కస్టోడియల్ డెత్‌పై నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే భారీ నిరసన.. Video
Sircilla | సిరిసిల్లలో ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు 6 వేలు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన
Nagarkurnool | తిమ్మినోనిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం