సిరిసిల్ల రూరల్, జూలై 13: సిరిసిల్లలో (Sircilla) ఇసుక కొరతతో ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ధర ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత లేదు.. ఉచితంగా అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్న లబ్ధిదారులకు అధిక భారంగా మారింది. రూ.5 లక్షలతో ఇల్లు ఎలా పూర్తి చేయాలోనని మదన పడుతున్నారు. ఆదివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధి 10వ వార్డులోని విలీన గ్రామమైన చిన్న బోనాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక ఉచితమని చెప్పి, ఒక ట్రాక్టర్ ట్రిప్పుకూ రూ.5 వేల నుంచి రూ.6 వేలు అడుగుతున్నారని పేర్కొన్నారు. ఇష్టముంటే పోసుకో.. లేకపోతే లేదని ట్రాక్టర్ యజమానులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అధిక ధర కావడంతో వార్డులోని 26 ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఇసుకతోపాటు మట్టి, సిమెంట్, కంకర సైతం అధిక ధరలు చెపుతున్నారని, రూ.5 లక్షలతో ఇల్లు నిర్మాణం కాదని, అప్పులపాలు అవుతామని, సీఎం రేవంత్ రెడ్డి, కలెక్టర్, అధికారులు స్పందించి, తమకు న్యాయం చేయాలని కోరారు.ఇసుక ధర తక్కువ చేసి, ఇతర మెటీరియల్ సైతం తక్కువ ధరలకు వచ్చేలా చూడాలని వేడుకున్నారు. లేనట్లయితే ఇంటి నిర్మాణాలు నిలిపి వేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సలేంద్రి దేవయ్య, చలిమెల వెంకన్న, చల్ల శ్రీకాంత్, దువ్వాల లక్ష్మి, బండారి రవి, పడిగే రాజనర్సు, తుమ్మల సుధాకర్, బోనాల ప్రమోద్, సుమన్, బాణోతు శ్రీను తదితరులు ఉన్నారు.