IND vs ENG : మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతున్న ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. లంచ్ బ్రేక్ తర్వాత కొరకరాని కొయ్యలా మారిన జో రూట్(40)ను వాషింగ్టన్ సుందర్ బౌల్డ్ చేశాడు. తన ఫేవరెట్ స్వీప్ షాట్ ఆడబోయిన నంబర్ 2 బ్యాటర్ బంతిని అంచనా వేయలేదు. ఇంకేముంది రెప్పపాటులో బంతి లెగ్ స్టంప్‌ను గిరాటేసింది. దాంతో, బెన్ స్టోక్స్(23)తో కలిసి జట్టును ఒడ్డున పడేయాలనుకున్న అతడి ప్రయత్నం నెరవేరలేదు. ఆలౌట్ ప్రమాదంలో పడిన ఇంగ్లండ్ జేమీ స్మిత్(4), స్టోక్స్లపైనే ఆశలు పెట్టుకుంది.
లంచ్ బ్రేక్ తర్వాత కూడా ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పడం లేదు. తొలి సెషన్లో సిరాజ్, బుమ్రాల ధాటికి ‘బజ్ బాల్’ ఆటను వదిలేసిన ఆతిథ్య జట్టు బ్యాటర్లు.. పరుగులు చేసేందుకు నానాతంటాలు పడుతున్నారు. బ్రూక్ (23) వికెట్ పడ్డాక.. కెప్టెన్ స్టోక్స్ (23)తో కలిసి రూట్ కీలక రన్స్ రాబట్టి స్కోర్ 150 దాటించాడు. ఐదో వికెట్‌కు 67 పరుగులు జోడించిన ఈ ద్వయాన్ని ఎట్టకేలకు సుందర్ విడదీశాడు. స్వీప్ షాట్ కొట్టే యత్నంలో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు రూట్. దాంతో, 154 వద్ద ఇంగ్లండ్ సగం వికెట్లు కోల్పోయింది.