IND vs ENG : ఉత్కంఠగా సాగుతున్న లార్డ్స్ టెస్టులో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. తొలిసెషన్లో డ్రింక్స్ బ్రేక్ వరకూ ఓపికగా ఆడిన కేఎల్ రాహుల్ (98 నాటౌట్), రిషభ్ పంత్(74)లు ఆ తర్వాత బౌండరీలతో విధ్వంసం సృష్టించారు. వైస్ కెప్టెన్ పంత్ అయితే.. తన మార్క్ షాట్లతో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేస్తూ అర్ధ శతకం బాదాడు. అయితే.. లంచ్‌కు ముందు ఓవర్లో రాహుల్ సెంచరీ కోసం తన వికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది. బషీర్ బౌలింగ్‌లో సింగిల్ తీయబోయిన పంత్‌ను స్టోక్స్ మెరువపు వేగంతో రనౌట్ చేశాడు. అంతే.. నాలుగో వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. లంచ్ టైంకి భారత్ స్కోర్.. 248/4. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 171 పరుగులు వెనకబడి ఉంది గిల్ సేన.
లార్డ్స్ మైదానంలో మూడో రోజు భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ఓవర్ నైట్ స్కోర్ 145-3తో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు కేఎల్ రాహుల్(98 నాటౌట్), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(74). క్రీజులో నిలబడితే చాలు పరుగులు వాటంతటవే వస్తాయని నిరూపిస్తూ.. ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచారిద్దరు. ఆర్చర్ ఓవర్లో రెండు ఫోర్లతో తొలి సెషన్‌ను ఆరంభించిన పంత్.. వోక్స్ బౌలింగ్‌లో లాంగాఫ్‌లో బౌండరీతో గేర్ మార్చాడు.
A moment of magic from the England captain! 🎯
(via @englandcricket) #ENGvIND pic.twitter.com/6wRh56nte6
— ESPNcricinfo (@ESPNcricinfo) July 12, 2025
రాహుల్ సైతం బ్యాట్ ఝులిపిస్తూ కార్సే ఓవర్లో స్క్వేర్ లెగ్, బ్యాక్వర్డ్ పాయింట్ లెగ్ సైడ్ దిశగా హ్యాట్రిక్ ఫోర్లతో అలరించాడు. మరింత దూకుడుగా ఆడిన పంత్ ఇంగ్లండ్ సారథి స్టోక్స్ బౌలింగ్‌లో సిక్సర్‌తో 86 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రాహుల్ సెంచరీకి చేరవైనందున లంచ్‌కు ముందు ఓవర్లో సింగిల్ తీసి స్ట్రయిక్ ఇవ్వాలనుకున్నాడు పంత్. కానీ, స్టోక్స్ మెరుపు వేగంతో బంతిని వికెట్లకు గురి చూసి కొట్టగా రనౌటయ్యాడు. అంతే.. లక్కీగా డేంజరస్ బ్యాటర్ ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. లంచ్ టైంకి భారత్ 4 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.