Fish Venkat | టాలీవుడ్ కమెడియన్ ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయకుండా పోవడంతో, నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.కిడ్నీ మార్పిడి కోసం రూ.50 లక్షలు అవసరం కావడంతో దాతల కోసం ఎదురు చూస్తున్నారు. వెంకట్ కుటుంబం తమ కష్టాలను వివరిస్తూ సినీ ప్రముఖుల సాయాన్ని కోరింది. కొందరు స్పందించినా, పెద్ద హీరోలు ఇప్పటివరకు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఫిష్ వెంకట్ తన కెరీర్‌ను ‘సమ్మక్క-సారక్క’ సినిమాతో ప్రారంభించారు. ‘ఖుషీ’, ‘ఆది’, ‘దిల్’, ‘బన్నీ’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. కానీ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీగా మారారు. అయితే షుగర్ కారణంగా కాలిని తీసివేసి పరిస్ధితి వచ్చిందని, డబ్బులు లేక గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నానని ఫిష్ వెంకట్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే ఆయన పరిస్ధితి గురించి తెలుసుకున్న పలువురు ప్రముఖులు అప్పట్లో స్పందించి కొంత సాయం చేశారు.
ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఫిష్ వెంకట్ గత 20 రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్నారని, ఆయన కళ్లు కూడా తెరవడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఆయన గురించి కొన్ని తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫిష్ వెంకట్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడని, అందుకే ఆయన ఆస్థి అంతా కరిగిపోయిందని అంటున్నారు. ఈ సమయంలో ఫిష్ వెంకట్ కూతురు స్పందిస్తూ.. నాన్న ఆరోగ్యం గురించి మేము ఆందోళన చెందుతుంటే ఇలా తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు.మా నాన్న రెండు పెళ్లి చేసుకున్నాడు అనే దానికి ప్రూఫ్ ఉందా? చేసుకుంటే వేరే ఆమె ఎక్కడుంది? రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు అనే దానిలో వాస్తవం లేదు. ఇలాంటి సమయంలో మా బాధని అర్ధం చేసుకొని రూమర్స్ సృష్టించకండి అని ఆయన కూతురు వేడుకున్నారు.