Bottle Gourd Juice | చాలా మంది ఆహారంగా తీసుకునే కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. దీన్నే ఆనపకాయ అని కూడా పిలుస్తారు. సొరకాయతో పచ్చడి, కూర, పప్పు, స్వీట్స్ వంటి రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. సొరకాయతో వివిధ రకాల వంటకాలు తయారు చేసి తీసుకోవడంతో పాటు దీనితో జ్యూస్ ను కూడా తయారు చేసి తీసుకోవచ్చు. సొరకాయ జ్యూస్ ను ఆయుర్వేదంలో అనేక అనారోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు. సొరకాయలో సుమారు 96 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరిచే, హైడ్రేట్ చేసే గుణాలను కలిగి ఉంటుంది. ఖాళీ కడుపుతో తీసుకుంటే మరింత మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. నీటితో పాటు సొరకాయలో తక్కువ మొత్తంలో ప్రోటీన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ తో పాటు ఫైబర్, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు కూడా ఉంటాయి.
సొరకాయలో తక్కువ కొవ్వుతో పాటు తక్కువ సోడియం ఉంటుంది కనుక ఇది త్వరగా జీర్ణమవుతుంది. ఇక పరగడుపున సొరకాయ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సొరకాయలో నీటితో పాటు కరిగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సొరకాయ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ ఎంజైమ్స్ ఉత్తేజితం అవుతాయి. కడుపులో మంట వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. సొరకాయ జ్యూస్ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. 100 ఎంఎల్ సొరకాయ జ్యూస్ లో 12 నుండి 15 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలి అవ్వకుండా ఉంటుంది. దీంతో తక్కువ ఆహారాన్ని తీసుకోగలుగుతారు. సొరకాయలో పొటాషియం కూడా ఉంటుంది. కనుక ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల సోడియం ప్రభావం తగ్గుతుంది. శరీరంలో అదనంగా ఉండే ద్రవాలు బయటకు పోతాయి. అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది.
ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల హృదయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీరాన్ని డిటాక్స్ చేయడంలో కూడా సొరకాయ జ్యూస్ సహాయపడుతుంది. ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాల్లో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ ను తాగడం వల్ల శరీరం నుండి మలినాలు, విష పదార్థాలు బయటకు వెళ్తాయి. సొరకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కనుక ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉండడంతో పాటు వృద్దాప్య లక్షణాలు తగ్గుతాయి. ఈ విధంగా సొరకాయ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఇక సొరకాయ జ్యూస్ ను ఉదయం పరగడుపున తీసుకోవడం మంచిది. పరగడుపున తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అలాగే పోషకాలు చక్కగా అందుతాయి. అలాగే మధ్యాహ్నం భోజనానికి 20 నుండి 30 నిమిషాల ముందు కూడా తీసుకోవచ్చు. అయితే సాయంత్రం సమయంలో దీనిని తీసుకోకూడదని, సాయంత్రం సమయంలో తీసుకోవడం వల్ల ఇది కొందరిలో జీర్ణ సమస్యలు కలిగించవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు.