Farmers Lands | మెదక్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : రైతుల భూ హక్కులను పక్కాగా నమోదు చేసి భూ వివాదాలకు ముగింపు పలికే లక్ష్యంతో భూ రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీ సర్వే అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. సుమారు వందేళ్ల క్రితం నిజాం ప్రభుత్వ కాలంలో 35 నుంచి 40 సంవత్సరాలపాటు శ్రమించి భూముల నక్షాలను రూపొందించారని తెలిపారు. అప్పటి నుంచి కొన్ని గ్రామాల్లో భూ నక్షాలలో సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకే భూ రీ సర్వే కార్యక్రమాన్ని శాస్త్రీయంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
రీ సర్వే ద్వారా ప్రతీ భూ కమతాన్ని ఆన్లైన్ డిజిటలైజేషన్లో నమోదు చేసి భూధార్ కార్డులను అందజేస్తామని తెలిపారు. భూమి ప్రతీ రైతుకు ఒక సెంటిమెంట్ అని, భూమి కోసం రైతులు ఎంతగానో కష్టపడుతుంటారని పేర్కొన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో 24 గ్రామాల్లో భూ రీ సర్వేను శాస్త్రీయంగా నిర్వహించి రైతుల భూ హక్కులను పరిరక్షిస్తామని తెలిపారు.
రీ సర్వే పూర్తయ్యాక విదేశాల్లో ఉన్న వారు సైతం తమ భూములను ఆన్లైన్ ద్వారా సులభంగా పరిశీలించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, ఏడీ ల్యాండ్ సర్వే కిషన్, డీపీఆర్వో రామచంద్రరాజు, తహసీల్దార్ రజినీ, ఎంపీడీవో, గ్రామ సర్పంచ్ అనిల్, ఉప సర్పంచ్ ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Bhadradri Kothagudem : కత్తి పట్టిన కలెక్టర్
ఏరియా వర్క్ షాప్లో సిపిఆర్, అగ్నిమాపక యంత్రాల వినియోగంపై అవగాహన
‘గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను సద్వినియోగం చేసుకోవాలి’