భద్రాచలం, ఆగస్టు 2: భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. 56.7 అడుగుల గరిష్ఠ నీటిమట్టం వరకు చేరిన గోదావరి క్రమేపీ తగ్గుతూ ఆదివారం రాత్రి 10 గంటలకు 40.90 అడుగులకు తగ్గడంతో మూడు ప్రమాద హెచ్చరికలను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్శ్రేష్ట ఉపసంహరించారు. భద్రాచలం వద్ద శనివారం అర్ధరాత్రి 52.60 అడుగులున్న గోదావరి ఆదివారం ఉదయం 5 గంటలకు 49.70 అడుగులు, 9 గంటలకు 47.20, 11 గంటలకు 46.20, మధ్యాహ్నం ఒంటిగంటకు 44.90, 3 గంటలకు 44, సాయంత్రం 5 గంటలకు 42.90, రాత్రి 10 గంటలకు 40.90 అడుగులకు తగ్గడంతో ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించుకున్నారు.
సోమవారం సాయంత్రం వరకు గోదావరి సాధారణ స్థితికి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతోపాటు మేడిగడ్డ, అన్నారం, ఎస్స్ఆర్ఎస్పీ, తుపాకులగూడెం నుంచి నీటి విడుదల లేకపోవడంతో నీటిమట్టం తగ్గుతోంది. తాలిపేరు ప్రాజెక్టు నుంచి సైతం నీటి విడుదలను నిలిపివేసారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి భద్రాచలం నుంచి చర్ల, కూనవరం, చింతూరు, కుక్కునూరు వైపు రాకపోకలు పునరుద్ధరించారు. రోడ్లపై పలుచోట్ల భారీగా బురద పేరుకుపోయింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడురోజులుగా భద్రాచలం శివారున మట్టికట్ట వేసి మూసివేసిన విజయవాడ- జగదల్పూర్ జాతీయ రహదారిని పునరుద్ధరించారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.

చర్ల మండలం లింగాపురం, కొత్తపల్లి ప్రాంతాలను చుట్టుముట్టిన గోదావరి వరద పూర్తిగా తగ్గిపోవడంతో వ్యవసాయ పనులు ప్రారంభంకానున్నాయి. దుమ్ముగూడెం మండలం తూరుబాక, గంగోలు, చర్ల మండలం కుదునూరు గ్రామాల వద్ద భద్రాచలం-వెంకటాపురం రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు తగ్గిపోవడంతో ఆర్టీసీతోపాటు సాధారణ ప్రయాణికులను అధికారులు అనుమతించారు. పర్ణశాలలోని సీతాకుటీరం వద్ద ఇంకా వరద నీరు తొలగలేదు. మరోవైపు భద్రాచలం వద్ద మూడురోజులుగా భక్తులను గోదావరిలో స్నానాలు చేసేందుకు అనుమతించడం లేదు. దీంతో భక్తులు వెనుదిరుగుతున్నారు. విస్తా కాంప్లెక్సు వద్ద మూసివేసిన స్లూయీజ్ నుంచి బాహుబలి మోటర్ల సహాయంతో భద్రాచలం పట్టణంలోని మురుగునీటిని కరకట్టపై నుంచి పైపుల ద్వారా ఎత్తిపోస్తున్నారు.