గద్వాల, ఆగస్టు 2 : జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తుంది. ఎగువన వర్షాలు కురువడంతోపాటు నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు తీస్తూ ప్రవహిస్తోంది.ఆదివారం జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో జూరాల కృష్ణమ్మ నీటితో కళ కళ లాడింది. సాయంత్రం వరకు జూరాలకు 1,56,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.33 మీటర్ల నీటి నిల్వ ఉంది.
జూరాల ప్రాజెకు ్ట పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.334 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వఉంది. విద్యుదుత్పత్తికి 32,475 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,56,500 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 27గేట్లు తెరిచి దిగువకు 1,21,383 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఇన్‌ఫ్లో 1,56,500లు నమోదు కాగా మొత్తం అవుట్ ఫ్లో 1,58,702గా నమోదైంది. భీమా నదికి వరద పెరగడంతో జూరాలకు వరద పెరిగే అవకాశం ఉంది. వరద ఉధృతి పెరిగితే రాత్రికి మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
శ్రీశైలం, ఆగస్టు 1 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తు న్న వర్షాల వల్ల జూరాల ప్రాజెక్టు దాటుకొని కృష్ణమ్మ వడివడిగా రావడంతో శ్రీశైల జలాశయంలో నీటి నిల్వ గంటగంటకూ పెరుగుతుంది. వరద ప్రవాహం ఇదే విధంగా కొనసాగినట్లయితే రానున్న మూడు, నాలుగు రోజుల్లో శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆదివారం జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల ద్వారా 1,21,383 క్యూసెక్కుల నీరు విడుదల కాగా, విద్యుదుత్పత్తి ద్వారా 32,475 క్యూసెక్కుల వరద నీరు విడుదలైంది. మొత్తం 1,52,186 క్యూసెక్కుల నీరు విడుదలవ్వగా ఆదివారం సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్‌కు 1,69,211 క్యూసెక్కుల నీరు వచ్చిందని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులుకాగా ప్రస్తుతం 849.70 అడుగులు, పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 79.45 టీఎంసీల నీరు ఉన్నట్లు నమోదైంది. అదేవిధంగా కుడి, ఎడమ గట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఎటువంటి ఉత్పత్తి జరగడం లేదు.