అయిజ, ఆగస్టు 2 : ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతుండగా, టీజీ డ్యాం నుంచి నీటి విడుదల చేయకపోవడంతో తుంగభద్ర నది వెల వెల బోతున్నది. మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ, భీమా, మలప్రభ, ఘటప్రభ నదుల్లో నీటి ప్రవా హం పెరిగింది. దీంతో ఆలస్యంగానైనా ఆల్మట్టి డ్యాం గేట్లు తె రుచుకున్నాయి. ఆల్మట్టి డ్యాం నుంచి దిగువన ఉన్న నారాయణపుర డ్యాంకు నీటిని వదుతున్నారు. అక్కడి నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద జలాలు చేరుకుంటున్నాయి. జూరాల నుంచి వదిలిన నీరు సప్తనదుల సంగమానికి, అక్కడి నుంచి శ్రీశైలం వెళ్తోంది.
కృష్ణానది కంటే ముందుగానే తుంగభద్ర నదిలో వరద ప్రవాహం కనిపించినా.. ఆశించిన స్థాయిలో కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో వానలు కురవకపోవడంతో తుంగభద్ర నదికి వరద ప్రారంభం కాలేదు. ప్రస్తు తం శివమొగ్గ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో టీబీ డ్యాంకు వరద మొదలు కావడంతో ఎల్నినో ప్రభావం దృష్ట్యా ఏపీ, కర్ణాటక రాష్ర్టాల్లోని ప్రజల దాహార్తి తీర్చేందుకు హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, కర్ణాటక కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నదికి నీటి విడుదల లేకపోవడంతో నదీతీర ప్రాంత ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో నీటిపారుదల లేకపోవడంతో ఒట్టిపోగా, అయిజ మండలం, పులికల్ సమీపంలోని నాగల్దిన్నె వద్ద తుంగభద్ర నీటి ప్రవాహం లేక వెల వెల బోతున్నది. ఏపీ, కర్ణాటక రాష్ర్టాలు తాగునీటి అవసరాల నేపథ్యంలో తుంగభద్ర డ్యాం నుంచి నీటిని విడుదల చేసుకుంటున్నా తుంగభద్ర నదిలోకి చుక్కనీరు విడుదల చేయకపోవడంతో కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ర్టాల నదీతీర ప్రాంతాల రైతు లు, ప్రజలు నీటి కోసం తంటాలు పడుతున్నారు. టీబీడ్యాం నుంచి తుంగభద్ర నదికి నీటిని విడుదల చేస్తే నదీతీర ప్రాంతాల ప్రజలకు దాహార్తి తీర్చడంతోపాటు సాగునీటికి ఇబ్బందులు తొలగుతాయని, ఆ దిశగా ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాలు కృషి చేయాలని మూడు రాష్ర్టాల రైతులు, ప్రజలు కోరుతున్నారు.