న్యూఢిల్లీ, అక్టోబర్ 4 : ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ను సస్పెండ్ చేయాలని కోరుతూ, అలాగే ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ఆయన నేతృత్వంలోని ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకున్న తీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనున్నది. కాకేష్ కుమార్ సింగ్, న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్లను సీజేఐ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, వీ మోహనలతో కూడిన ధర్మాసనం విచారించనున్నది.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన ఇద్దరు సహచరుల అంగీకారం లేకుండా తీసుకున్న నిర్ణయాలు, మార్గదర్శకాలు, సాఫ్ట్వేర్ మార్పులను కూడా వారు సవాలు చేశారు. చట్టబద్ధంగా మొత్తం ఎన్నికల సంఘానికి చెందిన అధికారాలను జ్ఞానేశ్ కుమార్ వ్యక్తిగతంగా వినియోగిస్తున్నారా, లేదా అని నిర్ధారించాలని, ఒకవేళ అదే జరిగితే ఆ చర్యలను అనధికారమైనవిగా ప్రకటించి, తగిన చర్యలు తీసుకోవాలని పాట్నా నివాసి రాకేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) సుప్రీంకోర్టును కోరింది.