హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల ముందు ఆశా వర్కర్ల వేతనాన్ని రూ.18 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ధోకా చేసిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం తెలంగాణ భవన్లో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్, ఆశా వర్కర్స్ యూనియన్ (ఏడబ్ల్యూయూ) రాష్ట్ర అధ్యక్షురాలు రావుల సంతోష ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా యూనియన్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సమావేశంలో సర్కార్ మోసంపై చర్చించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలోనే ఆశా వర్కర్లకు న్యాయం జరిగిందని తెలిపారు. రూ.2 వేలు ఉన్న వేతనాన్ని రూ.9,700కు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో వారు ప్రధానపాత్ర పోషిస్తున్నారని, వీరి సమస్యలపై తాను గతం లో పార్లమెంట్లో మాట్లాడినట్టు గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో కొత్త మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ దవాఖానల విస్తరణతో రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేశామని, కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు. ఆశా వరర్ల సమస్యలను కేవలం ఉద్యోగుల అంశంగా కాకుండా ప్రజారోగ్య సమస్యగా చూడాలని వినోద్‌కుమార్ ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికైనా వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఆశా కార్యకర్తలు తమ హక్కుల సాధనకు కలిసికట్టుగా పోరాడాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ పిలుపునిచ్చారు. వారికి బీఆర్టీయూ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఓట్ల కోసం నోటికొచ్చిన హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి మూడేైండ్లెనా హామీలను నెరవేర్చకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
ఆశ కార్యకర్తలకు రూ.18వేల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఆచరణలో మాత్రం మొండిచెయ్యి చూపుతున్నదని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు రావుల సంతోష ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడేండ్లుగా ఎదురుచూశామని, ఇక సర్కార్‌పై తమ తడాఖా చూపుతామని, త్వరలోనే పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివశంకర్, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజుల, కోశాధికారి స్వరూప, బీఆర్టీయూ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, మెదక్ జిల్లా అధ్యక్షుడు జుబేర్ తదితరులు పాల్గొన్నారు.