IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో నిరాశపరుస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. హ్యాట్రిక్ ఓటముల నుంచి తేరుకొని పంజా విసిరేందుకు హైదరాబాద్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటన్స్(Gujarat Titans)తో మ్యాచ్‌కు ముందు ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్లు దైవ దర్శనం చేసుకున్నారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma), ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)లు శనివారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన వీళ్లు అనంతరం తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా పూజారులు అభిషేక్, నితీశ్‌లకు అమ్మవారి ప్రసాదం అందించారు. ఆ తర్వాత ఆలయ అధికారులు ఇద్దరినీ సన్మానించారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది.
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించిన SRH ప్లేయర్లు అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి pic.twitter.com/rLoqTjuhLI
— Telugu Scribe (@TeluguScribe) April 5, 2025
ఐపీఎల్ 18వ సీజన్‌ను విజయంతో ఆరంభించిన సన్‌రైజర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. లక్నో, ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడిన హైదరాబాద్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 80 పరుగుల తేడాతో మ్యాచ్ చేజార్చుకుంది. దాంతో, గుజరాత్‌తో ఆదివారం జరుగబోయే మ్యాచ్ కమిన్స్ సేనకు కీలకం కానుంది. గత మూడు మ్యాచుల్లో దారుణంగా విఫలమైన అభిషేక్, నితీశ్ కుమార్ రెడ్డిలు అదరగొట్టాలనే కసితో ఉన్నారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్.. క్లాసెన్, అనికేత్ వర్మలు చెలరేగి ఆడితే గుజరాత్‌కు కష్టాలు తప్పకపోవచ్చు.