నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), ఏప్రిల్ 05 : ప్రభుత్వ విద్య కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బక్క శ్రీనివాస్ చారి అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత పది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సుమారు 8 లక్షలు తగ్గిందని తెలిపారు. ఇది చాలా పెద్ద సంఖ్య కావున ఉపాధ్యాయులు తమ హక్కుల కంటే ఎక్కువగా బాధ్యతలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని, లేనట్లయితే ప్రభుత్వ విద్య క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వ విద్య మెరుగుకు ప్రభుత్వం కూడా ఇంకాస్త దృష్టి పెట్టి సమూల మార్పులు చేయాలని, తాను ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో ప్రభుత్వ విద్య మెరుగుదలకు ఇటు ప్రభుత్వానికి అటు ఉపాధ్యాయులకు చాలా సూచనలు చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వెంకట్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయం కోసం, సమాజాభివృద్ధికి తద్వారా దేశ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. అనంతరం గ్రూప్-1 ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన రమాదేవి-శ్రీనివాస్ కుమారుడు దాడి వెంకటరమణ (2వ ర్యాంక్), విజయలక్ష్మి-వెంకట్ రెడ్డి కుమారుడు ఎన్.మనోజ్ కుమార్ (11వ ర్యాంక్), నర్రా కరుణ-శేఖర్ రెడ్డి కుమార్తె శ్రీజారెడ్డి (184వ ర్యాంక్) ను అభినందించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షుడు శేఖర్ రెడ్డి, కోశాధికారి రాజు, కుటుంబ సంక్షేమ నిధి రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, కుటుంబ సంక్షేమ నిధి బోర్డ్ మెంబర్ రమాదేవి, రాష్ట్ర కమిటీ సభ్యులు సీహెచ్ అరుణ, జిల్లా కార్యదర్శులు రామలింగయ్య, గేర నరసింహ, ఎం.శ్రీనివాస్ రెడ్డి, నలపరాజు వెంకన్న, కృష్ణారెడ్డి, యాదగిరి, పగిల్ల సైదులు, కొమార్రాజు సైదులు, వేదశ్రీ, మిట్టపల్లి మురళయ్య, నరసింహమూర్తి, భాను ప్రకాశ్, మధుసూదన్, దాసరి ప్రభాకర్, చింతమల్ల వరలక్ష్మి, పగిడిపాటి నరసింహ, గిరి యాదయ్య, ఎర్నాగుల సైదులు, రాగి రాకేశ్, గోన శ్రీలత పాల్గొన్నారు.