కాలం సగం గడిచిపోయింది. గ్యారెంటీల అమలులో దారుణంగా విఫలమైంది. హామీల అమలుకు ప్రజలిచ్చిన వ్యవధి ఎప్పుడో తీరిపోయింది. ఆ పార్టీ మోసాన్ని, రాష్ట్రంలో దాని అరాచకాలను ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎండగడుతాం. గ్యారెంటీల అమలు కోసం ప్రైవేట్ బిల్లు ద్వారా ప్రశ్నిస్తం. కాంగ్రెస్ సభ్యులు కూడా బిల్లుకు మద్దతిచ్చి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
– కేటీఆర్
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): నాడు ‘జై తెలంగాణ’ నినాదంతో ప్రజలందరినీ ఏకం చేసి రాష్ర్టాన్ని ఏవిధంగా సాధించామో, ఇప్పుడు ‘సేవ్ తెలంగాణ’ నినాదంతో కాంగ్రెస్ అనే అనకొండ నుంచి రాష్ర్టాన్ని రక్షించుకుందామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. దొంగ-చీకటి ఏకమైనట్టుగా రెండు జాతీయ పార్టీలు ఏకమై తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మరింత ధాటిగా పోరాడుదామని పిలుపునిచ్చారు. వెయ్యి గొంతుకలతో చట్టసభలతోపాటు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ తీరును ఎండగడుదామని చెప్పారు.
అభూత కల్పనలు, అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి లాటరీ సీఎం అయితే, కేసీఆర్ ఒక హిస్టరీ అని అభివర్ణించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని గోలొండ రిసార్ట్‌లో మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన వర్క్‌షాప్‌లో అనేక అంశాలపై లోతుగా చర్చించారు.
సీనియర్ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, నియమనిబంధనలపై అవగాహన కల్పించారు. అనుసరించాల్సిన వ్యూహాలపై, అప్పులు, ఆదాయాలు, హామీల ఎగవేతలు తదితర అంశాలపై గణాంకాలు సహా సభ, ప్రజల దృష్టికి ఎలా తీసుకెళ్లాలో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. సభలో ప్రతిక్షణం అలర్ట్‌గా ఉంటూ సమయ స్ఫూర్తితో వ్యవహరించాలని తెలిపారు. జీఆరో అవర్‌లో లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానాలు ఇవ్వకపోవడంపై బీఏసీ సమావేశంలో సీనియర్ సభ్యులు నిలదీయాలని సూచించారు.
సోషియో ఎకనామిక్ సర్వే, ఆర్బీఐ, కాగ్ లెక్కలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని, కాంగ్రెస్ సర్కార్ ఓపెన్ మార్కెట్లో తీసుకున్న అప్పులు, ఆదాయం లేని కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పుల వివరాలను గణాంకాలు సహా వివరించాలని చెప్పారు. రెండేండ్లలో రికార్డు స్థాయిలో అప్పులు చేసిన కాంగ్రెస్ సర్కార్.. గత బీఆర్ఎస్పై నెపం నెడుతున్నదని, పార్లమెంట్ చెప్పిన సమాధానాన్ని మరోసారి సభలో వివరించాలని కోరారు. కష్టసమయంలోనే సంతోషం విలువ తెలుస్తుందని, సమిష్టిగా, దృఢంగా ప్రజల తరఫున కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీద్దామని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం పార్టీ సీనియర్ నేతలతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధుకు స్వస్తి పలికి రాహుల్‌బంధు పథకాన్ని కొనసాగిస్తున్నది. అందుకే మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటీకి తెరలేపుతున్నది. రెండేండ్లలో ఏ వర్గానికీ పైసా ఇవ్వలేదు. ఆరు గ్యారెంటీలు, హామీలు నెరవేర్చడం లేదు. నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది. బుల్డోజర్ పాలన నడుపుతున్నది. అసెంబ్లీ స్టాండింగ్ కమిటీల్లేవు. అన్ని అంశాలు, అన్నివర్గాల తరపున అసెంబ్లీల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రైవేట్ బిల్లులు పెడుతాం’ అని కేటీఆర్ వెల్లడించారు. బడ్జెట్ చర్చలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బుల్డోజర్లు పంపి ఇండ్లు కూలగొడుతున్న తీరుగానే శాసనసభలోనూ మంద బలంతో బుల్డోజర్ కుయుక్తులను ప్రయోగిస్తున్నదని కేటీఆర్ నిప్పులు చెరిగారు. అబద్ధాలు, అసత్యాలు పచ్చిగా మాట్లాడుతూ అంకెలను తారుమారు చేస్తూ తూతూమంత్రంగా శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహిస్తున్నదని ధ్వజమెత్తా రు. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ హామీనిచ్చిందని, రెండున్నరేండ్లయినా ఇప్పటికీ చట్టబద్ధత కల్పించకపోవడమేగాక, అమలు కూడా చేయడం లేదని విమర్శించారు. ఈ సమావేశాల్లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును బీఆర్ఎస్ తరఫున తెచ్చేందుకు ప్రయత్నిస్తామని, ఆ బిల్లుకు మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. హామీల అమలును పకన పెట్టి నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీసేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఓవైపు డబ్బుల్లేవని, అప్పులయ్యాయని చెప్తూనే మూసీలో రూ.లక్షన్నర కోట్ల అవినీతికి తెరలేపడం, ఇందుకోసం లక్షలాది మంది ఇండ్లను కూలగొట్టడాన్నే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తేల్చిచెప్పారు. ప్రభుత్వ దాష్టీకం వల్ల ఇండ్లు కోల్పోయిన ఖమ్మం జిల్లా వెలుగుమట్ల, మూసీ బాధితులు, పేదలు, దళిత గిరిజనులు, దివ్యాంగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు ఇలా తెలంగాణ సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని, హామీల అమలు వైఫల్యాన్ని ప్రశ్నిస్తామని పునరుద్ఘాటించారు. లేని అప్పులు ఉన్నట్టుగా చూపుతూ, కట్టని మిత్తీలను కట్టినట్టు చూపుతూ అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీని అవే అంకెలు సహా ఎండగట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
మధుపార్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను జీరో వాల్యూ చేయడంపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అసలు జీరో వాల్యూ ఎవరికైనా ఉన్నదంటే అది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికేనని ఎద్దేవాచేశారు. రేవంత్‌రెడ్డి మాటలకు ముమ్మాటికీ జీరో విలువే ఉన్నదని దెప్పిపొడిచారు. ఏం చేస్తున్నాడో? ఏం మాట్లాడుతున్నాడో? ఆయనకే తెలియదని, సొంతంగా తాను తీసుకున్న నిర్ణయాలు కూడా తనకే తెలియని ఏకైక సీఎం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. రియల్ ఎస్టేట్‌ను కుప్పుకూల్చి, డే ఎకానమీని నాశనం చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు నైట్ ఎకానమీ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని అభివర్ణించారు. రెండున్నరేండ్లలో కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కట్టినా తాను రాజీనామా చేస్తానని చేసిన సవాల్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ కట్టిన ఫ్లై ఓవర్లు, ఇండ్లు, ప్రాజెక్టులకు రం గులు పూసి, రిబ్బన్ కట్ చేస్తూ, ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తూ కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ఎండగట్టే క్రమంలో మీడియా కూడా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గడిచిన రెండున్నరేండ్లలో ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున అద్భుతంగా పోరాటం చేశామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. హైడ్రాను బూచిగా చూపి ప్రజల నుంచి పెద్ద మొత్తంలో కాంగ్రెస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. నాడు బీఆర్ఎస్ హయాంలో సింగిల్ విండోలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులిస్తే, నేడు పారిశ్రామికవేత్తల తలపై తుపాకీ పెట్టి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్నివర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పడానికి తాజాగా ముగిసిన ఎన్నికలే నిదర్శమని చెప్పారు. నాడు మున్సిపల్ ఎన్నికల్లో 95 శాతం స్థానాలను అధికార పార్టీ బీఆర్ఎస్ గెలిచిందని, ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో 39 శాతం ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చాయని గుర్తుచేశారు. బలంగా ఉన్న బీసీ ఉద్యమానికి మన పార్టీ మద్దతు ఇవ్వాలని కోరారు. ఖమ్మంలో రాక్షసంగా సర్కార్ పేదల ఇండ్లు కూలగొట్టిందని, వారి ఉసురు కాంగ్రెస్ సర్కార్‌కు తగులుతుందని మండిపడ్డారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని నమ్మబలికిన రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు ఎంతమందిని కోటీశ్వరులుగా చేశారో చెప్పాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కోటీశ్వరులను చేస్తామని మోసం చేయడమేకాకుండా వారికి వడ్డీ డబ్బులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. పింఛన్లు పెంచుతామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి, పింఛన్లు పెంచకపోగా కోత పెట్టారని, కొత్త పింఛన్లు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేసీఆర్ మానవీయ కోణంలో తీసుకొచ్చిన న్యూట్రిషియన్ కిట్, కేసీఆర్ కిట్, దళిత బంధు పథకాలను కూడా ఆపేశారని విమర్శించారు. రైతుబంధు ఇప్పటికే మూడుసార్లు ఎగ్గొట్టారని మండిపడ్డారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో విద్యుత్తు, నీటి సరఫరా రంగాల్లో దృఢమైన వ్యవస్థలు ఏర్పాటు చేశారని, వాటిని వాడుకోవడం రేవంత్ సర్కార్‌కు చేతకావడం లేదని, మళ్లీ నీళ్లు లేక, కరెంట్ కోతలతో పంటలు ఎండుతున్నాయని మండిపడ్డారు. 2004నాటి దారుణ పరిస్థితులు తెలంగాణకు దాపురిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌పై సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి బీఆర్ఎస్ సభ్యులకు సభా మర్యాదలు, సాంకేతిక అంశాలను వివరించారు. ముఖ్యంగా ప్రశ్నోత్తరాలు అంటే స్టార్డ్ (నక్షత్ర గుర్తు గల), అన్ స్టార్డ్ ప్రశ్నల మధ్య వ్యత్యాసం, వాటి ప్రాధాన్యతను వివరించారు. జీరో అవర్, కాలింగ్ అటెన్షన్, షార్ట్ డిసషన్ వంటి సమయాల్లో ప్రజల గొంతుకను ఎలా వినిపించాలో దిశానిర్దేశం చేశారు. వాయిదా తీర్మానం, బడ్జెట్ డిమాండ్లు, ప్రైవేట్ మెంబర్ బిల్స్‌పై అవగాహన కల్పించారు. అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీడింగ్స్‌పై పట్టు సాధిస్తే పట్టు నిలుపుకోవచ్చని తెలిపారు.
బడ్జెట్ సమావేశాల ప్రాముఖ్యతను శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ వివరించారు. బడ్జెట్ ప్రతిపాదనలను ఎలా అధ్యయనం చేయాలి? గణాంకాలను ఎలా విశ్లేషించాలి? అనే అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించారు. శాసన మండలిలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరు, చర్చల్లో పాల్గొనేటప్పుడు పాటించాల్సిన నిబద్ధతను వివరించారు. ప్రజాప్రతినిధులు సభా నియమాలను తెలుసుకున్నప్పుడే సమర్థంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలరని, అందుకే బీఆర్ఎస్ ఈ ఓరియంటేషన్ కోర్సును ఏర్పాటు చేసిందని సూచించారు. సభ నిబంధనలపై పట్టు సాధించడం ద్వారానే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లవచ్చని చెప్పారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుకు డబ్బుల్లేవని చెప్తున్నరు. మహిళలు, విద్యార్థులకిచ్చిన హామీలకు డబ్బుల్లేవంటున్నరు. రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధును పక్కనపెట్టిండ్రు. కానీ రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి చెప్తున్నడు. ఢిల్లీకి డబ్బుల మూటలు పంపేందుకే మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్‌కు తెరలేపిండ్రు.
– కేటీఆర్
‘ఆరు గ్యారెంటీల ద్వారా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ఓట్లు వేయించుకున్నది. ఇప్పటికే సగం ప్రభుత్వ పదవీ కాలం తీరిపోయింది. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది. రేవంత్ సర్కార్ అసెంబ్లీలో మూడో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఆ పార్టీ మోసాన్ని ప్రైవేట్ బిల్లు ద్వారా ప్రశ్నిస్తం. కాంగ్రెస్ సభ్యులు కూడా బిల్లుకు మద్దతునిచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి’ అని కేటీఆర్ కోరారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన పార్టీ వ్యూహాలపై కూలంకషంగా చర్చించామని, సీనియర్ నేతలు మధుసూదనాచారి, బండా ప్రకాశ్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితాఇంద్రారెడ్డి, రావుల చంద్రశేఖర్ తదితరుల సలహాలు, అనుభవజ్ఞులైన నేతల సూచనలు తీసుకున్నామని వెల్లడించారు. రెండేండ్లు దాటినా అసెంబ్లీలో ఏ కమిటీలనూ వేయడం లేదని, పబ్లిక్ అకౌంట్స్ కమిటీని సైతం తమ పార్టీ నుంచి గెలిచి, ద్రోహపూరితంగా కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తికే ఇచ్చారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. సెలెక్ట్, స్టాండింగ్, పిటిషన్స్ కమిటీలే కాదు.. అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్ కూడా లేకుండా పోయారని మండిపడ్డారు. అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ సమావేశాలు నడిపిస్తున్నది తప్ప మరేమీ లేదని విమర్శించారు.
తెలంగాణలో బీసీ ఉద్యమం జోరందుకున్నదని, ఆ అంశాన్ని ప్రతిపక్ష పార్టీగా ఓన్ చేసుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి సూచించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్టుగా బీసీలను కూడా కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. క్షేత్రస్థాయిలో ప్రజావ్యతిరేకతను గ్రహించి సభలో బీఆర్ఎస్ సభ్యులకు అధికార కాంగ్రెస్ అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. గతంలో 100 నుంచి 140 రోజులు సమావేశాలు జరిగేవని, ఇప్పడు చాలా తక్కువ రోజులు నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నాడు మంచినీటి సమస్యలు, కుండల ప్రదర్శన, సాగునీటి సరఫరా లేక ఎండిపోయిన వరి కంకులు, కరెంటు కోతలపై లాంతర్ల ప్రదర్శనలు చేపట్టేవాళ్లమని గుర్తుచేశారు. పదేండ్లపాటు ఇలాంటి ప్రదర్శనలు చేయాల్సిన అవసరం లేకుండా కేసీఆర్ పాలన సాగించారని చెప్పారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, తాగునీటి వెతలు వెక్కిరిస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ పాలన ప్రగతి చరిత్ర అయితే, రేవంత్ పాలన దుర్గతి చరిత్రగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేలా బడ్జెట్ గణాంకాలను చట్టసభల్లో సభ్యులు వెల్లడించాలని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్రావు సూచించారు. బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలు, వాస్తవ ఖర్చులపై సభ్యులకు పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు. బడ్జెట్ కేటాయింపుల ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఎంత లాభం చేకూరింది? రాష్ట్ర ప్రజలకు ఎంత ప్రయోజనం కలిగింది? అనే కోణంలో సభ్యులు పరిశీలించాలని సూచించారు. కేంద్రం నుంచి రాష్ర్టాలకు 38 శాతం నిధులే వస్తున్నాయని, రాష్ర్టాలు మాత్రం 60 శాతం ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పారు. రాష్ర్టాలకు పంచే పన్నులను పెంచకుండా, పంచని (నాన్ షేరబుల్) పన్నులను కేంద్రం పెంచుతున్నదని తెలిపారు. ఒక కేటాయింపులో అదే అంశాలపై గతంలో ఎంత కేటాయించారో పోల్చాలని సూచించారు.