న్యూఢిల్లీ, జూలై 25: నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో నెలకొన్న ఒత్తిడి కారణంగా కేంద్ర మంత్రి పదవికి శనివారం రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్(57) గత కొన్నేండ్లుగా బీజేపీలో అత్యంత కీలకమైన నాయకులలో ఒకరిగా ఎదిగారు. ఆయన మొదట ఒక సమర్థవంతమైన నిర్వాహకుడు. ఆ తర్వాత మంత్రి. అలాగే పార్టీ అగ్రశ్రేణి నిర్ణేతలకు అత్యంత సన్నిహితంగా మెలిగే రాజకీయ వ్యూహకర్త. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి, దేశవ్యాప్తంగా ప్రభావం చూపగలిగిన అతికొద్ది మంది ఒడిశా వ్యక్తులలో ఆయన కూడా ఒకరు. రాజకీయ కుటుంబంలో జన్మించిన ధర్మేంద్ర ప్రధాన్ చిన్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ సంబంధించిన సామాజిక-సాంస్కృతిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు.
1993లో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ధర్మేంద్ర 1995లో జాతీయ కార్యదర్శిగా ఎదిగారు. 1997లో పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణలపై ఒడిశా సచివాలయం బయట దాడాపు 1500 మంది విద్యార్థులతో కలసి ఆందోళన నిర్వహించిన ధర్మేంద్ర ప్రధాన్ పోలీసుల లాఠీచార్జ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం 1998లో బీజేపీలో చేరిన ఆయన 2000 సంవత్సరంలో తొలిసారి ఒడిశా ఎమ్మెల్యేగా గెలిచారు. 2001లో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, 2002లో జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2004లో యువమోర్చా జాతీయ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 2012లో బీహార్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ప్రధాన్ 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెట్రోలియం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2021లో విద్యాశాఖను చేపట్టిన ఆయన మూడవసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంలో అదే శాఖలో కొనసాగారు. 2024లో బీజేపీ ఒడిశాలో సొంతంగా అధికారాన్ని చేపట్టడంలోనూ, బీజేడీని ఓడించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. విద్యాశాఖ మంత్రిగా ఆయన ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు జాతీయ స్థాయి పరీక్షలపై ప్రజల విశ్వాసానికి పదేపదే దెబ్బ తగలడం. ప్రశ్నపత్రాల లీకేజ్ ఆరోపణలు, పరీక్షల రద్దు, పునర్వ్యవస్థీకరణ వంటి విషయాలపై మంత్రిత్వశాఖ పరిశీలనను ఎదుర్కోవడంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, నియామక పరీక్షల నిర్వహణపై ప్రతిపక్షాల విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఆయన పదవీకాలంలో విద్యారంగంలో ఆర్ఎస్ఎస్ జోక్యం పెరుగుతోందన్న ఆరోపణలు కూడా వచ్చాయి.