హయత్‌నగర్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): మహానగరంలో మళ్లీ దొంగల భయం కలకలం రేపుతోంది. సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సైబరాబాద్ పరిధిలోని నార్సింగి ఠాణా పరిధిలో చెడ్డీ గ్యాంగ్ ఇళ్లను దోచుకున్న ఘటన మరువముందే తాజాగా హయత్‌నగర్‌లో మూడు ఇళ్లలో చోరీకి పాల్పడడం గమనార్హం. శాంతిభద్రతల పరిరక్షణ, నిఘా పెంచడం, ప్రజలకు మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు నగర పోలీస్ వ్యవస్థను పునర్యవస్థీకరిస్తూ కమిషనరేట్ల సంఖ్యను పెంచినా, కొత్త జోన్లు, డివిజన్లు, ఠాణాలను ఏర్పాటు చేసినా ప్రజలకు భద్రత లేకుండా పోవడంపై జనం మండిపడుతున్నారు.
ప్రజయ్ గుల్మోహార్ గేటెడ్ కమ్యూనిటీ హాల్లో దొంగలు పడి బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్లల్లో తాళాలను పగులగొట్టి చోరీ చేశారు. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. డీఐ సంతోష్ కుమార్ వివరాల ప్రకారం..అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, పెద్దఅంబర్‌పేటలోని ప్రజయ్ గుల్మోహార్ గేటెడ్ కమ్యూనిటీ నందు సయ్యద్ మోసిన్ హుస్సేన్, కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్. అక్టోబర్ 22న కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం పట్టణానికి వెళ్లారు. పక్కనే నివాసముంటున్న సంజీవరావు రిటైర్డ్ ఉద్యోగి. అతడు కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఆగస్టు 28న మంచిర్యాలలోని తన సొంతూరుకు వెళ్లారు.
ఊరికి వెళ్తున్న సమయంలో సంజీవరావు ఇంట్లోని తమ విలువైన బంగారు ఆభరణాలు, నగదును బ్యాంక్ లాకర్లో భద్రపర్చుకుని వెళ్లిపోయారు. బుధవారం ఉదయం ఖమ్మం నుండి వచ్చిన సయ్యద్ మోసిన్ హుస్సేన్ ఇంట్లోకి వెళ్లి చూడగా తాళాలు పగులగొట్టి బీరువాలోని వస్తువులన్నీ చిందరవందరగా పడేసి కనిపించాయి. పక్కనే నివాసముంటున్న సంజీవరావుకు కూడా విషయం తెలుపడంతో హుటాహుటిన చేరుకున్న ఆయనకు ఇంట్లోని వస్తువులన్నీ పడేసి కనిపించాయి.
విలువైన బంగారు నగలు, నగదును లాకర్లో భద్రపర్చుకోవడంతో ఆర్ధిక నష్టం పెద్దగా జరగలేదు. విషయం తెలుసుకున్న హయత్‌నగర్ డీఐ సంతోష్‌కుమార్, సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల్లో దొంగలు సంచరిస్తున్న ఫుటేజీలను, క్లూస్ టీమ్‌తో పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.