మణికొండ, అక్టోబర్ 1 : నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య వెలుగుచూసింది. కోకాపేట నియోపోలీస్ సమీపంలోని యాదవ సంఘ భవనం ముందు ఓ వ్యక్తి మృతదేహం లభించడంతో స్థానికంగా కలకలం చోటుచేసుకుంది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన వెంకన్నగా గుర్తించారు.
అతడు ఓయూలో పీహెచ్డీ చేస్తున్నట్లు తెలిసింది. తలపై తీవ్ర గాయాలు ఉండటంతో క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసి హత్యచేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి మాదాపూర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, నార్సింగి ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డిలు చేరుకుని డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం, దర్యాప్తు బృందాలతో ఆధారాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు.