సిటీబ్యూరో, అక్టోబరు 1 (నమస్తే తెలంగాణ) : పాలనను సులభతరం చేస్తామంటూ విరజిమ్మిన మాటల వెనుక గ్రేటర్ పౌరుల జేబులు ఖాళీ చేసే పకా వ్యూహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. నగరంలో ఇప్పటికే భూముల సవరణ పేరిట రిజిస్ట్రేషన్ చార్జీలతో సామాన్యుడి నడ్డివిరిచిన ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ‘క్యూర్ బిల్లు’ చట్టం ద్వారా ప్రజలపై మరో మోయలేని ఆస్తి పన్ను భారాన్ని మోపడానికి మార్గం సుగమమం చేసింది. ఇన్నాళ్లు ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ విధానానికి తిలోదకాలు ఇచ్చి, భూములు, భవనాల మారెట్ క్యాపిటల్ వ్యాల్యూ (ఆస్తి రిజిస్ట్రేషన్ విలువ) ఆధారంగా పన్నులు లెకించే సరికొత్త పన్ను దందాకు తెరలేపారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భూముల విలువలు కోట్లలో ఉండటంతో, ఇకపై చెల్లించాల్సిన ఆస్తి పన్ను ఊహించని స్థాయికి చేరనుంది.
జీహెచ్ఎంసీ పరిధిలోను ఇకపై క్యాపిటల్ వ్యాల్యూ ఆధారంగానే ప్రాపర్టీ ట్యాక్స్ ఈ చట్టంలో ఆస్తి పన్ను విధింపు విధానంలోకి తీసుకువచ్చారు. ఇప్పటివరకు అమలులో ఉన్న యాన్యువల్ రెంటల్ వ్యాల్యూ (ఏఆర్వీ) స్థానంలో సబ్ రిజిస్ట్రార్ రేట్ల ఆధారంగా క్యాపిటల్ వ్యాల్యూ (సీవీ) పద్ధతిని అమలు చేయనున్నారు. ఇందులో భాగంగానే గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న ఆస్తుల ‘పీటీఐఎన్ సంఖ్యలను రిజిస్ట్రేషన్ శాఖ మారెట్ విలువల డేటాతో సైలెంట్‌గా అనుసంధానం పూర్తి చేశారు. కొత్త చట్టం ప్రకారం ఏటా కనీసం 10 శాతం మేర ఆస్తి పన్నును అదనంగా పెంచుకుంటూ పోయేలా ప్రతిపాదించి పౌరులను శాశ్వత పన్నుల చక్రబంధంలోకి నెట్టేశారు. ఉదాహరణకు ఏడాదికి 10వేల ఆస్తిపన్ను కట్టే యాజమాని ఆ తర్వాత ఏడాది రూ.11వేలు మరుసటి ఏడాది 11వేలపై అదనంగా 10 శాతంతో రూ.12వేలు.. ఇలా ప్రతి ఏడాది పన్నుల భారం మోయక తప్పని పరిస్థితి.
రిజిస్ట్రేషన్ శాఖ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం నగరంలో మారెట్ విలువతో అనుసంధానించిన ఆస్తుల సంఖ్య మొత్తం 13,22,966 ఉండగా, ఇందులో నివాస గృహాలు 10,75,113, వాణిజ్య సముదాయాలు 2,18,820, మిశ్రమ ఆస్తులు 29,033లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆస్తుల ద్వారా జీహెచ్ఎంసీకి ప్రతిఏటా రూ. 824.24 కోట్ల వార్షిక డిమాండ్ (నివాస రంగానికి రూ. 293.54 కోట్లు, వాణిజ్య రంగానికి రూ. 465.66 కోట్లు, మిశ్రమ ఆస్తులకు రూ. 65.06 కోట్లు) ఉంది. నూతన క్యాపిటల్ వ్యాల్యూ ప్రకారం పౌరులపై భారం మోపి రూ.వేల కోట్ల ఆదాయం ఆర్జించనున్నది.
శుక్రవారం (నేటి నుంచి) కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే ఆస్తులకు క్యాపిటల్ వ్యాల్యూ ఆధారంగానే పన్ను నిర్ణయిస్తారు. పాత ప్రాపర్టీలకు మాత్రం ఏప్రిల్ 2027 నుంచి సీవీ పద్ధతి అమలులోకి వస్తుంది. చట్టం ప్రకారం ఏటా ఆస్తిపన్ను10 శాతం మేర పెరగనుంది. జీహెచ్ఎంసీలో విలీనమైన 27 మున్సిపాలిటీల్లో ఇప్పటికే సీవీ ఆధారంగా పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పుడు పాత జీహెచ్ఎంసీ పరిధిలోనూ ఇది వర్తించనుండటంతో.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, శేరిలింగంపల్లి, మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల నుంచి జీహెచ్ఎంసీ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది.
ఏడు దశాబ్దాలుగా అమలులో ఉన్న జీహెచ్ ఎంసీ-1955 చట్టం స్థానంలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్ ) చట్టం అమలు కానుంది. ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం తెలుపగా..ఇటీవల గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నేడు ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ‘ఒకే నగరం.. ఒకే పరిపాలన.. ఒకే చట్టం’ అనే మూలసూత్రంతో రూపుదిద్దుకున్న ఈ చట్టం పరిధిలోకి నూతనంగా ఏర్పాటైన ట్రై కార్పొరేషన్ జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ ఏకీకృత పాలనా వ్యవస్థ అందుబాటులోకి రానున్నది.
మార్గదర్శకాల జారీ, క్షేత్రస్థాయి అమలుకు మరో ఆరు నెలల సమయం పట్టనుండగా, వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ చట్టం పూర్తిస్థాయిలో పట్టాలెకనుంది. ఇందులో భాగంగానే క్యూర్ చట్టంతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి పూర్తిస్థాయి చట్టబద్ధత లభించింది. పాత ఈవీడీఎం స్థానంలో జీఓ 99 ద్వారా పురుడుపోసుకున్న హైడ్రాకు ఈ చట్టంతో అదనపు అధికారాలు సంక్రమించాయి. ఇకపై అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై హైడ్రా నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు వీలుగా ప్రత్యేకం చట్టబద్ధమైన పోలీస్ స్టేషన్ పరిధిలోకి రానుంది.