సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): : జీహెచ్ ఎంసీ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జోన్లు, డివిజన్లు, శాంతిభద్రతల పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ విభాగాల పరిధులను ప్రభుత్వం మరోసారి పునర్వ్యవస్థీకరణకు ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవలే నగర పోలీస్ వ్యవస్థలో పెను మార్పులు చేసి, రాచకొండ కమిషనరేట్‌ను మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్‌గా పేరు మార్చడంతో పాటు సైబరాబాద్, పాత రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని పలు ఠాణాలతో కలిపి కొత్తగా ఫ్యూచర్‌సిటీ పోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రగన్, శంషాబాద్ జోన్లలో పలు ప్రాంతాలను హైదరాబాద్ పరిధిలోకి, మరికొన్ని ప్రాంతాలను ఫ్యూచర్ సిటీ పరిధిలోకి విలీనం చేసి, 44ఠాణాలతో విస్తరించి ఉన్న సైబరాబాద్‌ను 22ఠాణాలకు కుదించిన విషయం తెలిసిందే. అదే క్రమంలో హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిల్లోనూ పెను మార్పులు చేశారు. అయితే ఇటీవల జరిగిన పునర్వ్యవస్థీకరణ గందరగోళం నుంచే ఇంకా తేరుకోకముందే మరోసారి పునర్వ్యవస్థీకరణ పేరుతో నాలుగు కమిషనరేట్ల పరిధిలో మార్పులు చేయడంతో అటు పోలీసులు, ఇటు ప్రజల్లో అయోమయం నెలకొంది.
సికింద్రాబాద్ జోన్, మారెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట వార్డుతో పాటు కొన్ని ప్రాంతాలను మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ మొత్తాన్ని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చారు. అలాగే బడంగ్ పేట్ పోలీస్ స్టేషన్‌ను రద్దు చేసి, ఆ ఠాణా పరిధిలోని ప్రాంతాలను ఆదిభట్ల ఠాణా పరిధిలో కలుపుతూ ఉత్తర్వుల్లో పేరొన్నారు. మహేశ్వరం ప్రాంతంలోని కొన్ని గ్రామాలను పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి, అలాగే శంషాబాద్ ప్రాంతంలోని కొన్ని గ్రామాలను ఆర్ జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో విలీనం చేశారు.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ డివిజన్‌ను శంషాబాద్ డివిజన్‌గా, చికడపల్లి డివిజన్‌ను కాచిగూడ డివిజన్‌గా, సంతోష్ నగర్ డివిజన్‌ను ఛత్రినాక డివిజన్‌గా, ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌ను శంషాబాద్ పోలీస్ స్టేషన్‌గా పేరు మార్చారు.
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగంలోనూ పలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధులను పునర్వ్యవస్థీకరించారు. బంజారాహిల్స్ , జూబ్లీహిల్స్ , ఎస్ఆర్నగర్, అబిడ్స్ , పంజాగుట్ట, సైఫాబాద్ , సుల్తాన్ బజార్ , చిలకలగూడ, గాంధీనగర్ , మహంకాళి, ఉస్మానియా యూనివర్సిటీ, కాచిగూడ, చార్మినార్ తదితర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధుల్లో మార్పులు చేశారు. మహిళా భద్రత విభాగానికి ప్రత్యేక పరిధులు
మహిళా భద్రత విభాగంలో వెస్ట్ , ఈస్ట్ , సెంట్రల్ , ఖైరతాబాద్, సౌత్ , సౌత్ వెస్ట్ , సౌత్ ఈస్ట్ , గోలొండ, రాజేంద్రనగర్ తదితర జోన్లకు సంబంధించిన మహిళా పోలీస్ స్టేషన్ల పరిధులను కూడా పునర్వ్యవస్థీకరించారు.
జోనల్ సైబర్‌సెల్ లను కూడా పునర్వ్యవస్థీకరిస్తూ వెస్ట్ , ఈస్ట్ , సెంట్రల్ , సౌత్ , సౌత్ వెస్ట్ , సౌత్ ఈస్ట్ జోన్లతో పాటు జూబ్లీహిల్స్ , సికింద్రాబాద్ , ఖైరతాబాద్ , చార్మినార్ , గోలొండ, రాజేంద్రనగర్ ప్రాంతాలకు సంబంధించిన జోనల్ సైబర్ సెల్ పరిధులను నిర్దేశించారు. ఈ పునర్వ్యవస్థీకరణ అమలులోకి వచ్చిన తేదీ నుంచి సంబంధిత పోలీస్ స్టేషన్లు, డివిజన్లు, జోన్ల పరిధులు కొత్త ఉత్తర్వుల ప్రకారం కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించి ప్రస్తుత పోలీస్ స్టేషన్లు, జోన్లు, డివిజన్ల పరిధిలో ఉన్న పలు కాలనీలు, గ్రామాలను కొత్త ఠాణాల పరిధుల్లోకి మార్పు చేశారు. అమీన్పూర్, బొల్లారం, రామచంద్రాపురం, నార్సింగి, కొల్లూరు, పటాన్చెరు, తదితర ప్రాంతాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్లు, డివిజన్లు, జోన్ల పరిధుల్లో మార్పులు చేశారు. బొల్లారం మున్సిపాలిటీకి చెందిన పలు వార్డులు, కాలనీలు కూడా పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త పోలీస్ పరిధుల్లోకి మార్చారు.
కొల్లూరు, పటాన్చెరు పోలీస్ స్టేషన్ల పరిధిల్లో పలు మార్పులు చేశారు. పటాన్చెరు ఠాణా పరిధిలోని ఏదుల నాగులపల్లి, ఘనాపూర్ , వేముకుంట, కహర్దానూర్ , పాటి, వెలిమెల, వెలిమెల తండా, తదితర ప్రాంతాలను కొల్లూరు పరిధిలో విలీనం చేశారు. అదే విధంగా రామచంద్రాపురం, నార్సింగి ఠాణాల పరిధిలోనూ పలు మార్పులు చేశారు. నార్సింగి పరిధిలోని హైదర్షాకోట్ , గంధంగూడ, బైరాగిగూడ, పీరంచెరువు, మంచిరేవుల, నార్సింగి, నెక్నాంపూర్ , పుప్పాలగూడ, కోకాపేట, గండిపేట, ఖానాపూర్ ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్‌లోని రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో విలీనం చేశారు.
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లోని మోకిలా ఠాణా పరిధిలోని జన్వాడ, మిర్జాగూడ, మహరాజ్‌పేట, దొంతన్‌పల్లి, గోపులారం, పిల్లిగండ్ల, మియాఖాన్‌గడ్డ, ఇందిరారెడ్డి నగర్ ప్రాంతాలను సైబరాబాద్ కమిషనరేట్‌లోని నార్సింగి ఠాణా పరిధిలోకి విలీనం చేశారు.
ఇక మలాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్ లా అండ్ ఆర్డర్ జోన్‌ను కొత్తగా ఏర్పాటు చేయడంతో పాటు అల్వాల్ , ఉప్పల్ , మేడిపల్లి లా అండ్ ఆర్డర్ డివిజన్లను, ఉప్పల్ ట్రాఫిక్ డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. అదే సమయంలో బేగంపేట్ లా అండ్ ఆర్డర్ జోన్‌ను రద్దు చేశారు.
కొత్తగా అల్వాల్ డివిజన్ ఏర్పాటు
అల్వాల్ డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేసి, ఈ డివిజన్లో హైదరాబాద్ సిటీ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధుల్లో ఉన్న కొన్ని ప్రాంతాలను విలీనం చేశారు. ఈ క్రమంలో తిరుమలగిరి డివిజన్లోని ప్రాంతాలు, అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన ప్రాంతాల్లోనూ మార్పులు చేశారు.
మలాజిగిరి కమిషనరేట్‌లో ఉప్పల్ డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ డివిజన్ కొత్తగా ప్రతిపాదించిన ఉప్పల్ జోన్లో భాగంగా ఉంటుంది. అలాగే మేడిపల్లి డివిజన్‌ను కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. చర్లపల్లి, నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల పోలీస్ స్టేషన్లు, డివిజన్ల పరిధుల్లో కూడా మార్పులు చేశారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో హస్తినాపురం 41వ వార్డు, బీఎన్ రెడ్డి నగర్ 42వ వార్డు వంటి ప్రాంతాలను విలీనం చేశారు. పోలీస్ లా అండ్ ఆర్డర్ విభాగంతో పాటు ట్రాఫిక్ విభాగంలోనూ మార్పులు చేపట్టారు. మలాజిగిరి ట్రాఫిక్ డివిజన్, ఎల్ బీనగర్ ట్రాఫిక్ డివిజన్ , తిరుమలగిరి ట్రాఫిక్ డివిజన్ల పరిధులను పునర్వ్యవస్థీకరించారు. బేగంపేట్, మలాజిగిరి, ఎల్ బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పరిధుల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.
అంతేకాకుండా ఉప్పల్ ట్రాఫిక్ డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. ఉప్పల్ , కుషాయిగూడ, ఘట్ కేసర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేసిన ఉప్పల్ ట్రాఫిక్ డివిజన్ పరిధిలోకి చేర్చారు. మహిళా భద్రతా విభాగాల్లో మార్పులుమలాజిగిరి కమిషనరేట్‌లో మహిళా భద్రతకు సంబంధించిన పోలీస్ స్టేషన్లు, విభాగాల పరిధుల్లో పునర్వ్యవస్థీకరణ చేశారు. బేగంపేట్, ఉప్పల్, సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్లకు సంబంధించి న పరిధులను కొత్తజోన్ , డివిజన్ వ్యవస్థకు అనుగుణంగా మార్చారు.