Shubman Gill : సుదీర్ఘ ఫార్మాట్లో మరో ‘నయవాల్’ కోసం నిరీక్షిస్తున్న భారత జట్టుకు గుడ్‌న్యూస్. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) వారసుడిగా పేరొందిన ఛతేశ్వర్ పూజారా(Chateshwar Pujara) స్థానాన్ని భర్తీ చేసే యోధుడు దొరికేశాడు. మూడో స్థానంలో వచ్చి బౌలర్లను విసిగిస్తూ.. క్రీజులో పాతుకుపోయి పరుగులు దొంగిలించే ‘నయావాల్’ పుట్టుకొచ్చాడు. అలాగని ద్రవిడ్, పూజారాల మాదిరిగా జిడ్డులా క్రీజులో పాతుకుపోవడమే పనిగా కాకుండా ధనాధన్ ఆడగల సమర్ధుడు అతడు. ఇంతకూ ఎవరతను అని ఆలోచనల్లో పడ్డారా..? ఇంకెవరు.. శుభ్‌మన్ గిల్ (Shubman Gill).
టెస్టు క్రికెట్లో మూడో స్థానం చాలా కీలకమైనది. ఓపెనర్లు తడబడిన చోట ఇన్నింగ్స్‌కు ఇరుసులా మారాల్సి ఉంటుంది. కొత్త బంతిని పాతబడేలా చేసి తర్వాత వచ్చే ఆటగాళ్లకు పరుగులు చేయడం తేలక చేయాల్సి వస్తుంది. ఈ బాధ్యతను గతంలో ద్రవిడ్, పూజరాలు అద్భుతంగా పోషించారు. ఆ తర్వాత ఎవరు? అనే ప్రశ్నకు నేనున్నాగా అంటూ గిల్ తన బ్యాటుతోనే సమాధానమిస్తున్నాడు.
Shubman Gill joins the centurion party with a fantastic 💯
This is his 5th Test ton 👏👏
Live – https://t.co/fvVPdgXtmj… #INDvBAN @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/ga7GcCr4ZA
— BCCI (@BCCI) September 21, 2024
చెపాక్ స్టేడియంలో ప్రశాంతంగా శతకంతో మెరిసిన గిల్ విమర్శకులకు చెక్ పెట్టాడు. రిషభ్ పంత్(109)తో కలిసి అతడు ఇన్నింగ్స్ నిర్మించి తీరు చూసిన వాళ్లంతా మాజీ ఆటగాళ్లు పూజారా లోటు పూడ్చాడు అంటూ గిల్‌ను ప్రశంసిస్తున్నారు. ఒకప్పుడు ఓపెనర్‌గా ఆడి మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఇబ్బందే. కానీ, యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) కోసం తన ప్లేస్ ఇచ్చేసిన గిల్ మూడో స్థానంలో పాతుకుపోవడంపై దృష్టి పెట్టాడు.
ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ సిరీస్‌పై సెంచరీతో సత్తా చాటిని అతడు ఇప్పుడు మళ్లీ ఆపద్భాందవుడయ్యాడు. చెపాక్‌లో బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి ఒకదశలో 63 పరుగులకే 3 వికెట్లు పడినా గిల్ ఏమాత్రం కంగారు పడలేదు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన అతడు.. ఈసారి బంగ్లాకు ఏ అవకాశం ఇవ్వలేదు. శాంటో సేన ఎత్తులను చిత్తు చేస్తూ.. ఆత్మవిశ్వాసంతో, కచ్చితత్వంతో షాట్లు ఆడుతూ స్కోర్‌బోర్డును నడిపించాడు.
రెండో రోజు 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన గిల్.. మూడో రోజు అదే జోరు చూపాడు. టెస్టుల్లో అజేయంగా ఐదో సెంచరీ కొట్టేసి జట్టుకు కొండంత ఆధిక్యాన్ని అందించాడు. చెపాక్‌లో అద్భుత శతకంతో ఇక మూడో స్థానం తనదే అని చెప్పకనే చెప్పేశాడు. ఇదే విషయాన్ని గిల్ మీడియా సమావేశంలో సైతం తెలిపాడు.
Skilful Gill rose to the occasion with a superb TON 👏👏
📽️ Relive his 5th Test Hundred 🔽#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) September 21, 2024
‘ఈ ఏడాది ఇంగ్లండ్ సిరీస్ నాలో ఆత్మవిశ్వాసం నింపింది. మూడో స్థానంలో ఆడగలననే ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చింది’ అని వెల్లడించాడు. గిల్ ఇప్పటివరకూ 19 ఇన్నింగ్స్‌ల్లో 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. తన కెరీర్ సగటు(37.46) కంటే ఉత్తమంగా అతడు 46.06 సగటుతో 737 పరుగులు సాధించడం విశేషం.
చెపాక్‌లో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గిల్, పంత్‌ల శతకాలతో బంగ్లాదేశ్‌కు భారత్ 517 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ ఛేదనలో బుమ్రా, అశ్విన్‌లు విజృంభించడంతో పర్యాటక జట్టు 4 కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. నాలుగో రోజు టీమిండియా విజయానికి 6 వికెట్లు కావాలంతే.