Satwik – Chirag : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల నిరీక్షణ ఫలించింది. గత రెండేళ్లుగా నిలకడగా రాణిస్తున్న ఈ ద్వయం ఎట్టకేలకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న(Major Dhyan Chand Khel Ratna Award) అవార్డును స్వీకరించింది. గురువారం కేంద్ర యువజన, క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya) చేతుల మీదుగా సాత్విక్, చిరాగ్‌లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అంతులేని సంతోషం వ్యక్తం చేసిన సాత్విక్ భారత ప్రభుత్వం తనను, చిరాగ్‌ను ఎంతగానో ప్రోత్సహించిందని తెలిపాడు.
‘ఎట్టకేలకు మేము మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్నాం. ఈ పురస్కారం కోసం రెండేళ్లుగా ఎదురుచూశాం. ఆలస్యం అయినా సరే కేంద్ర క్రీడల శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు స్వీకరించినందుకు సంతోషంగా ఉంది. బ్యాడ్మింటన్‌లో నేను, చిరాగ్ జోడీ కట్టినప్పటి నుంచి భారత ప్రభుత్వం మాకు అన్నివిధాలా ప్రోత్సాహిస్తూ వస్తోంది.
Catch the glimpses📷 as Hon’ble MYAS Mansukh Mandaviya felicitated the star badminton men’s doubles duo Satwiksairaj Rankireddy & Chirag Shetty & presented them with the prestigious 2023 #KhelRatna Award.
Many congratulations to #BrothersOfDestruction for this well – deserved… pic.twitter.com/aEyofvAgnF
— SAI Media (@Media_SAI) May 1, 2025
ఈ మధ్య కాలంలో కోర్టులో మేము సాధించిన గొప్ప విజయాలు ప్రభుత్వ మద్దతుకు నిదర్శనం. వరల్డ్ నంబర్ 1గా నిలవడం, ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలుపొందడంతో పాటు థామస్ కప్ టైటిల్ కొల్లగొట్టడం ద్వారా యువతలో స్ఫూర్తి నింపడమే కాకుండా యావత్ భారతం గర్వపడేలా చేశాం’ అని సాత్విక్ వెల్లడించాడు. ఖేల్ రత్న అవార్డు ప్రదానం సందర్బంగా సాత్విక్ చిరాగ్‌లకు మెడల్‌తో పాటు సర్టిఫికెట్ స్వీకరించారు. అనంతరం బ్యాడ్మింటన్ స్టార్లు మాండవీయకు రాకెట్‌ను బహూకరించారు.
ఒకప్పుడు పురుషుల బ్యాడ్మింటన్ క్రీడాకారులు అంటే ప్రకాశ్ పదుకొనే, పుల్లెల గోపిచంద్‌లు మాత్రమే గుర్తుకు వచ్చేవాడు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఈ దిగ్గజాలు యువతకు ఆదర్శంగా నిలిచి రాకెట్ పట్టేలా చేశారు. అయితే.. డబుల్స్‌లో అసమాన విజయాలు సాధించిన ఆటగాళ్లు కొందరే. కానీ, ఈమధ్య కాలంలో సాత్విక్ – చిరాగ్ ద్వయం అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ అబ్బురపరిచింది. 2022లో జరిగిన ఆసియా క్రీడల్లో పసిడతో మెరిసిన ఈ జోడీ 2023లో నంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకుంది.
అదే ఏడాది.. స్మాష్‌ను అత్యంత వేగంగా కొట్టిన ఆటగాడిగా సాత్విక్ గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాడు. అతడు గంటకు 565 కిలోమీటర్ల వేగంతో కాక్‌ను బాది ఈ రికార్డు నెలకొల్పాడు. 2024లోనూ కోర్టులో చెలరేగిన సాత్విక్ – చిరాగ్ జంట ఈ ఏడాది మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం డబుల్స్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో భారత జంట 11వ స్థానంలో కొనసాగుతోంది.