Indiramma houses | వీణవంక, మే 02: కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ కోర్కల్ గ్రామంలో మహిళలు, పురుషులు శుక్రవారం ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు. మండలంలోని కోర్కల్ గ్రామ మహిళలు, పురుషులు కరీంనగర్, జమ్మికుంట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సుమారు గంటపాటు రోడ్డు పై వాహనాలు నిలిచి పోయాయి. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ నిరుపేదలైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ కమిటీ సభ్యులు, అధికారులు వారికి నచ్చిన వారికే ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు రాయడం విడ్డూరంగా ఉందన్నారు. కొంతమంది నాయకులు రూ.20 వేలు ఇస్తే ఇండ్లు మంజూరు చెపిస్తామని అంటున్నారన్నారు.
కవర్లు కప్పుకొని, ఉండటానికి నీడకూడ లేనివాళ్లు ఉండగా సగం ఇళ్ల నిర్మాణం పూర్తయిన వారి దగ్గర డబ్బులు తీసుకొని వారి పేరు మీద ఇళ్ళు రాస్తున్నారని, మా బాధ ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ కార్యక్రమంలో మర్రి కుమార్ యాదవ్, మాజీ సర్పంచ్ మర్రి స్వామి, ఉప సర్పంచ్ పూదరి అనిల్, కృష్ణ, కొలిపాక రాకేష్, ఆంజనేయులు, రాజు బాబు, తిరుపతి, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.