Sanju Samson : భారత క్రికెట్లో దురదృష్టవంతుడు ఎవరు? అనే చర్చ జరిగినప్పుడల్లా వికెట్ కీపర్ సంజూ శాంసన్ (Sanju Samson)పేరు ప్రస్తావనకు వస్తుంది. సుదీర్ఘ అనుభవం, ప్రతభ, మెరుగైన సగటు(55.7) ఉన్నప్పటికీ సంజూకు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. అంతేకాదు అతడి కంటే వెనకొచ్చిన జూనియర్లు పాతుకుపోతుంటే అతడు మాత్రం అడపాదడపా జట్టులోకి వస్తూ పోతూ ఉండేవాడు. కానీ, ఈసారి శాంసన్ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు.
కీలక మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించి మాజీల ప్రశంసలు పొందాడు. వన్డేల్లో సెంచరీ కల నిజం చేసుకున్న ఈ హిట్టర్ గడిచిన నాలుగైదు నెలల్లో తీవ్రంగా మధనపడ్డాడని అన్నాడు. ‘గత మూడు, నాలుగు నెలలు మానసికంగా ఎంతో మధనపడ్డాను. అలాంటి కష్టమైన పరిస్థితుల నుంచి బయటపడి వన్డేల్లో సెంచరీ బాదడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. ఆట అనేది నా జీన్స్‌లోనే ఉంది. మానాన్న ఒక స్పోర్ట్స్‌మన్. ఎన్నిసార్లు కిందపడినా.. మళ్లీ అంతకంటే బలంగా దూసుకురావడం చాలా ముఖ్యం’ అని శాంసన్ తెలిపాడు.
తిలక్ వర్మతో 116 పరుగుల భాగస్వామ్యంపై కూడా సంజూ స్పదించాడు. ‘నిజం చెప్తున్నా నేను స్కోర్‌కార్డు అస్సలు చూడలేదు. తిలక్ వర్మతో మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని అనుకున్నా. బంతిని బాగా గమనించి ప్రశాంతంగా ఆడడం మొదలెట్టాను. ఈ క్రమంలోనే సెంచరీకి చేరువయ్యా. అందుకు చాలా సంతోషంగా ఉంది’ అని శాంసన్ వెల్లడించాడు.
వన్డేల్లో మూడంకెల స్కోర్ కోసం 8 ఏండ్లుగా నిరీక్షిస్తున్న శాంసన్.. దక్షిణాఫ్రికా గడ్డపై శతకంతో గర్జించాడు. కేశవ్ మహరాజ్ వేసిన 44వ ఓవర్ ఆఖరి బంతికి సంజూ సింగిల్ తీసి వంద పరుగుల మార్క్ అందుకున్న ఈ పవర్ హిట్టర్ సంతోషం పట్టలేకపోయాడు. ఆనందంలో మునిగితేలిన శాంసన్ డగట్లోని భారత బృందానికి తన కండలు చూపించి మురిసిపోయాడు. శాంసన్ సెంచరీతో భారత్.. సఫారీలకు 297 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ ఛేదనలో ఓపెనర్ టోని జోర్జి(81) రాణించినా మిగతా వాళ్లు చేతులెత్తేశారు. స్పీడ్‌స్టర్ అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లతో దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. దాంతో, భారత్ 78 పపరుగుల తేడాతో గెలుపొంది 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.