Rohit Sharma : పొట్టి క్రికెట్, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ (Rohit Sharma) రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తనను ఎంతో బాధించిందని అన్నాడు. సొంతగడ్డపై విశ్వవిజేతగా నిలవాలనుకున్న తమ కలల్ని ఆస్ట్రేలియా (Australia) కల్లలు చేసిందని.. ఆ ఓటమికి టీ20 వరల్డ్ కప్‌లో ప్రతీకారం తీర్చుకున్నామని హిట్‌మ్యాన్ చెప్పాడు. ఐసీసీ టోర్నమెంట్లలో వరుసగా రెండో ఫైనల్ చేరిన భారత జట్టు.. వెస్టిండీస్ గడ్డపై ఆసీస్ గోడను బద్ధలు కొట్టిన తీరును రోహిత్ వివరించాడు.
‘వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో మాకు ఆస్ట్రేలియా షాకిచ్చింది. అహ్మాదాబాద్ వేదికగా నవంబర్ 19న జరిగిన టైటిల్ పోరులో ఆసీస్ మా కలల్ని కూల్చింది. ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోయాం. అందుకే ఆ జట్టుకు మేము రిటర్న్ గిఫ్ట్‌గా అంతే బాధను ఇవ్వాలనుకున్నాం. ఇదే విషయమై తరచూ డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడుకునేవాళ్లం. టీ20 వరల్డ్ కప్‌లో ఆసీస్‌పై ప్రతీకార విజయం సాధించాలనుకున్నాం. మా చివరి సూపర్ 8 మ్యాచ్‌లో సమిష్టిగా చెలరేగాం.. కంగారూలను పొట్టి ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది’ అని హిట్‌మ్యాన్ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఆసీస్ విజయానంతరం విచారంలో రోహిత్
బలమైన పేస్ దళాన్ని ఉతికేస్తూ 92 పరుగులతో రాణించిన అతడు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లిన రోహిత్ సేన కప్‌ను ఎగరేసుకుపోయింది. ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో విరాట్ కోహ్లీ అర్ధ శతకంతో మెరవగా.. జస్ప్రీత్ బుమ్రా సంచలన బౌలింగ్‌తో రాణించాడు.
177 పరుగుల ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్ అర్ధ శతకంతో దక్షిణాఫ్రికా గెలుపు దిశగా దూసుకెళ్తున్న వేళ బుమ్రా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. కాసేపటికే పాండ్యా ఓవర్లో డేవిడ్ మిల్లర్(David Miller) ఆడిన బంతిని బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుత రీతిలో అందుకున్నాడు. అంతే.. సఫారీలకు మరోసారి నిరాశే మిగలగా రెండోసారి టీమిండియా పొట్టి కప్‌ను ముద్దాడింది.
రోహిత్ (92)
బార్బడోస్ గడ్డపై టీ20 ట్రోఫీ గెలుపొందిన తర్వాత రోహిత్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. కోహ్లీ వీడ్కోలు పలుకుతున్నట్టు చెప్పిన కాసేపటికే తాను కూడా పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడించాడు. అంతేకాదు ఇంగ్లండ్ పర్యటనకు ముందే టెస్టులకూ గుడ్ బై చెప్పేసి అందర్నీ షాక్‌కు గురిచేశాడు రోహిత్. ప్రస్తుతం విరాట్, హిట్‌మ్యాన్‌లు వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.