Suryakumar Yadav : భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు ‘స్పోర్ట్స్ హెర్నియా’ (Sports Hernia) సర్జరీ విజయవంతమైంది. జర్మనీలోని మ్యూనిచ్‌లో కడుపు భాగంలో కుడివైపున ఆపరేషన్ చేయించుకున్నాడు మిస్టర్ 360. నిరుడు జనవరి 9న సర్జరీ అనంతరం కోలుకొని టీ20 వరల్డ్ కప్ ఆడిన సూర్య ఈసారి మళ్లీ అదే సమస్యతో బాధపడ్డాడు. సో.. ఈమధ్యే జర్మనీకి వెళ్లిన ఈ చిచ్చరపిడుగు సర్జరీ చేయించుకున్నాడు. అనంతరం అభిమానులు ఆందోళన చెందవద్దని తాను వేగంగా కోలుకుంటున్నానని సూర్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.
ఆస్ప్రతి బెడ్ మీద నేను ఆల్రైట్ అంటూ నవ్వుతూ ఉన్న ఫొటోను పంచుకున్నాడీ క్రికెటర్. ఆ ఫొటోకు ‘లైఫ్ ఆప్డేట్: కడుపులో కుడివైపు కింద స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాను. ఆపరేషన్ విజయవంతమైందనే విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వేగంగా కోలుకుంటున్నాను. మళ్లీ మైదానంలో ఎప్పుడుఎప్పుడు అడుగుపెడతానా? అని ఉత్సాహంగా ఉన్నాను’ అని క్యాప్షన్ రాసుకొచ్చాడీ హిట్టర్. మొత్తంగా మూడేళ్లలో అతడికి మూడో సర్జరీ. మొదట సూర్యకు మోకాలి ఆపరేషన్, అనంతరం రెండు హెర్నియా సర్జరీలు జరిగాయి.
వైద్య పరిభాషలో స్పోర్ట్స్ హెర్నియాను ‘అథ్లెటిక్ పుబల్జియా'(Athletic Publgia) అని కూడా పిలుస్తారు. పొత్తి కడుపు కింది భాగంలోని లేదా గజ్జల (Groin) భాగంలోని మృదువైన కణజాలంలోని కండరాలు లేదా టిండాన్ లేదా లిగమెంట్ దెబ్బతినడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ఎలా ఉత్పన్నమవుతుందంటే.. ఉన్నట్టుండి ఒక్కసారిగా కదలడం వల్ల తుంటి భాగంలో ఉండే కణజాలం, కండరాలు దెబ్బతినడం వల్ల స్పోర్ట్స్ హెర్నియా వస్తుంది.
అయితే.. చాలావరకు ఫుట్‌బాల్, రెజ్లింగ్, ఐస్ హాకీ వంటి ఆటలు ఆడేవాళ్లు అకస్మాత్తుగా కదలడం వల్ల ఈ సమస్య బారిన పడుతుంటారు. అప్పుడప్పుడు క్రికెటర్లలోనూ ఈ ఇబ్బంది కనిపిస్తుంటుంది. అవును.. రెండేండ్ల క్రితం భారత ఆటగాడు కేఎల్ రాహుల్(KL Rahul) కూడా ఈ సమస్యతో బాధపడ్డాడు. 2002 జూలైలో సర్జరీ చేయించుకొని మళ్లీ పునరాగమనం చేశాడు రాహుల్.