చండ్రుగొండ, మార్చి 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా నిలుస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ జాఫర్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతలపూడి ప్రాంతానికి చెందిన కతిజాతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడ, మగ సంతానం కలరు. అన్యోన్యంగా కొనసాగుతున్న వీరు కాపురం లోకి చింతలపూడి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఖతిజాతో అక్రమ సంబంధానికి తెర తీశాడు. ప్రియుడు మోజులో పడిన ఖతిజా తన భర్త మద్యానికి బానిస అయ్యాడని ప్రచారాన్ని చేస్తూ ప్రియుడితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలో భర్త తరచూ నిలదీస్తుండడంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం పన్నింది. దీంతో ఈ నెల 12న తెల్లావారుజామున తన భర్త మంచంపై నుండి కింద పడి చనిపోయాడని ఏడుస్తూ గ్రామస్తులు, కుటుంబ సభ్యులను నమ్మించింది.
గురువారం సాయంత్రం వారి సాంప్రదాయాల ప్రకారం జాఫర్ మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించారు. శుక్రవారం ఉదయం భర్త చనిపోయాడన్న విషయాన్ని సైతం మరిచి ప్రియుడితో ఫోన్లో మాట్లాడటం కుటుంబ సభ్యుల అనుమానానికి తావిచ్చింది. విషయాన్ని గట్టిగా నిలదీయడంతో తన ప్రియుడుతో కలిసి గురువారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో ముఖంపై దిండు వేసి భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితురాలు ఖతిజాను అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ శివరామకృష్ణ తెలిపాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు ఎస్ఐ తెలిపారు.