దమ్మపేట, ఆగస్టు 04 : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఈ నెల 9న నిర్వహించే ప్రపంచ ఆదివాసి దినోత్సవ కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారి మాట్లాడుతూ ప్రతి గూడెంలో ఆదివాసి జెండా ఎగురవేయాలన్నారు. జాతి ఐక్యతను చాటాలని, తమ జాతి హక్కులను, చట్టాలను రక్షించడానికి బలమైన ఉద్యమం నిర్మించే దిశగా యువత అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజున ప్రతి ఒక్క ఆదివాసి జిల్లా ప్రధాన కేంద్రమైన కొత్తగూడెంలో నిర్వహించే భారీ సాంస్కృతిక ర్యాలీకి హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు తెల్లం రామారావు దొర, ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకుడు గడ్డం వెంకటేశ్వరరావు, ఆదివాసి యువ నాయకుడు కాకా రమేశ్ పాల్గొన్నారు.