టెహ్రాన్: ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei) ఇవాళ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడిని ఆయన ఖండించారు. ఆ దాడి కేవలం న్యూక్లియర్ అంశాలపై కాదు అని, అణు శుద్దీకరణ గురించి అసలే కాదు అని, కానీ ఇరాన్ లొంగిపోవాలన్న కాంక్షతో అమెరికా దాడులకు ప్రయత్నించినట్లు ఖమేనీ తెలిపారు. ఓ సారి మానవ హక్కులు, ఓ సారి మహిళా హక్కులు, ఓ సారి అణు కేంద్రాల అంశం, ఓ సారి మిస్సైళ్ల గురించి అమెరికా వత్తిడి తెస్తుందన్నారు. వాస్తవానికి ఈ అంశాల కన్నా.. తాము లొంగిపోవాలన్న ఉద్దేశంతోనే అమెరికా దాడులకు దిగినట్లు ఖమేనీ వెల్లడించారు. అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసిన తర్వాత తొలిసారి ఖమేనీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
సరెండర్ అన్న పదం తమ నిఘంటువులో లేదన్నారు. ఇరాన్ ప్రజలు ఐక్యతను ప్రదర్శించినట్లు ఖమేనీ మెచ్చుకున్నారు. తామంతా ఒకే స్వరాన్ని వినిపించినట్లు చెప్పారు. సరెండర్ కావాలని ట్రంప్ పేర్కొన్నారని, కానీ ఇరాన్ లాంటి గొప్పదేశానికి ఆ పదం ఓ అవమానం అని తెలిపారు. అమెరికా తన నైజాన్ని చెప్పకనే చెప్పేసిందని, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ను ఆ దేశం వ్యతిరేకిస్తున్న విషయం స్పష్టమైందన్నారు. ఇజ్రాయిల్ విజయం సాధించామని , దీని పట్ల కంగ్రాట్స్ చెబుతున్నట్లు ఖమేనీ తెలిపారు.
అణు కేంద్రాలపై దాడి చేసిన అమెరికా ఆ దాడులతో ఎటువంటి ఘనతను సాధించలేదని అన్నారు. జరిగిన ఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు అతిగా ప్రచారం చేసినట్లు ఖమేనీ ఆరోపించారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న కీలకమైన అమెరికా వైమానిక స్థావరాన్ని టార్గెట్ చేశామని, కానీ దాన్ని వాళ్లు కొట్టిపారేశారని అన్నారు.