Rohit Sharma | బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు రంజీ (Ranji)ల్లో ఆడనున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. ముంబయి-జమ్మూ కశ్మీర్ జట్ల మధ్య జరిగే రంజీ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని చెప్పాడు. అయితే, అంతర్జాతీయ క్యాలెండర్‌లోని బిజీ షెడ్యూల్ కారణంగా స్టార్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సమయం దొరకడం కష్టమని తెలిపాడు. దేశీయ రెడ్‌బాల్ టోర్నీలను ఏ క్రికెటర్ తేలిగ్గా తీసుకోరని రోహిత్ పేర్కొన్నాడు. చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు శనివారం బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి రోహిత్ మీడియా ముందుకు వచ్చాడు.
ఈ సందర్భంగా రంజీ ట్రోఫీలో ఆడతారా? అన్న ప్రశ్నకు రోహిత్ సానుకూలంగా స్పందించాడు. గత ఆరేడు సంవత్సరాలుగా క్యాలెండర్‌ను పరిశీలిస్తే తాము 45 రోజులుగా ఇంట్లో కూర్చోలేదని చెప్పాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే అంతర్జాతీయ మ్యాచులు లేనప్పుడు మాత్రమే విశ్రాంతి దొరికేదని తెలిపాడు. డొమెస్టిక్ సీజన్ అక్టోబర్‌లో ప్రారంభమై.. మార్చి వరకు కొనసాగుతుందని.. జాతీయ జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడని ఆటగాళ్లు దేశీయ క్రికెట్ ఆడొచ్చని చెప్పాడు. తన గురించి చెప్పాల్సి వస్తే.. తాను 2019 నుంచి క్రమం తప్పకుండా టెస్ట్ క్రికెట్‌ను ఆడుతూ వచ్చానని టీమిండియా కెప్టెన్ తెలిపాడు.
ఈ పరిస్థితుల్లో చాలా తక్కువ సమయం ఉంటుందని.. అంతర్జాతీయ క్రికెట్‌ను క్రమం తప్పకుండా ఆడుతున్న సమయంలో తమని తాము రిఫ్రెష్ చేసుకోవడం కొంత సమయం అవసరమని అభిప్రాయపడ్డాడు. దేశీయ క్రికెట్‌ని ఎవరూ తక్కువగా తీసుకోవడం లేదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా.. 37 ఏళ్ల రోహిత్ శర్మ ఇటీవల టెస్టుల్లో పేలవమైన ఫామ్‌తో ఇబ్బందులుపడుతున్నాడు. చివరి 15 టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక అర్ధ సెంచరీ చేసిన రోహిత్.. ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు నిరాకరించాడు. మంగళవారం వాంఖడే స్టేడియంలో ముంబయి జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఐదు ఇన్నింగ్స్‌లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. విమర్శల నేపథ్యంలో చివరిదైన సిడ్నీ టెస్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
Team India | బీసీసీఐ ఆంక్షలతో ఆటగాళ్ల విముఖత..! రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్