Team India | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శనివారం చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)కి, ఇంగ్లాండ్ (England)తో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) విలేకరుల సమావేశంలో జట్టును ప్రకటించారు. అంతకు ముందు రోహిత్, అగార్కర్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. దాంతో మీడియా సమావేశం ఆలస్యమైంది. విదేశీ పర్యటన సమయంలో ఆటగాళ్లతో ఫ్యామిలీ గడిపే సమయాన్ని బోర్డు పరిమితం చేసిన క్రమంలో దానిపై అగార్కర్‌తో రోహిత్ మాట్లాడడం కనిపించింది. రోహిత్ వ్యాఖ్యలు వీడియోలో సైతం రికార్డయ్యాయి. కార్యదర్శితో మాట్లాడాల్సి ఉంటుందని.. ఫ్యామిలీ పాలసీపై చర్చించాల్సి ఉంటుందని అగార్కర్‌తో రోహిత్ చెప్పడం వినిపించింది. ఆ తర్వాత అగార్కర్ విలేకరుల సమావేశాన్ని మొదలుపెట్టు చాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించారు.
Read Also : India Squad: సిరాజ్, శాంసన్ ఔట్.. వైస్ కెప్టెన్‌గా గిల్.. చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఇదే
ప్రస్తుతం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఏమాత్రం బాగా లేదని రోహిత్ మాటలను బట్టి తెలుస్తుంది. ఇటీవల ఆస్ట్రేలియాలో ఘోర పరాజయం తర్వాత.. విదేశీ పర్యటనల్లో ఆటగాళ్లు 45 రోజుల కంటే ఎక్కువగా ఉండే పర్యటనల్లో రెండు వారాల పాటు ప్లేయర్ల కుటుంబసభ్యులకు అనుమతి ఉంటుంది. ప్లేయర్లతో పాటు విజిటర్స్‌కు బీసీసీఐ వసతి ఏర్పాటు చేస్తుంది. మిగతావి సదరు ప్లేయర్ చూసుకోవాల్సి ఉంటుంది. అదీ కూడా పర్యటన మొత్తమ్మీద ఒక్కసారికే అనుమతి ఉంటుంది. సాధారణంగా ఆటగాళ్లు తమ భార్యలను, ఇతర కుటుంబ సభ్యులను పర్యటన సమయంలో తమ వెంట తీసుకువెళ్తుంటారు. కానీ, వరుస ఓటముల నేపథ్యంలో బీసీసీఐ కఠిన నిబంధనలు అమలులోకి తీసుకువచ్చింది. బీసీసీఐ కొత్తగా పది పాయింట్ల విధానాన్ని తీసుకువచ్చింది. ప్రతి క్రికెటర్ దేశవాళీ క్రికెట్ ఆడడం తప్పనిసరి చేసింది. విదేశీ పర్యటన సమయంలో వ్యక్తిగత సిబ్బందిని నిషేధించింది. ఇక పర్యటన సమయంలో వ్యక్తిగత ప్రకటనలను షూట్ చేసేందుకు అనుమతి ఉండదు. బీసీసీఐ ఇలా తీసుకువచ్చిన పది పాయింట్ల విధానాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందే. లేకపోతే బీసీసీఐ సదరు ఆటగాడిపై చర్యలు తీసుకోనున్నది. అలాగే, ఇకపై ఆటగాళ్లు ప్రత్యేకంగా ప్రయాణం చేసేందుకు అనుమతి ఉండదు. క్రికెటర్లంతా తప్పనిసరిగా ఒకేసారి ప్రయాణించాల్సిందే. ఒక వేళ సిరీస్ ముందస్తుగా ముగిసినా విడిగా ప్రయాణించేందుకు అనుమతి ఉండదు.
జాతీయ క్రికెట్ జట్టులో క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందించడానికి ఈ విధానాన్ని బీసీసీఐ అమలు చేసేందుకు నిర్ణయించింది.
ఆస్ట్రేలియాతో సిరీస్ ఓటమి.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత.. జట్టులో గ్రూపులుగా విడిపోవడం.. అందరూ కలిసి పోవడం లేదంటూ వార్తలు వచ్చాయి. వీటిపై దృష్టి సారించిన బీసీసీఐ ఈ మేరకు కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ సైతం స్టార్ సంస్కృతిని అంతం చేయాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ సైతం నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. బీసీసీఐ తీసుకువచ్చిన కొత్త పాలసీపై ఆటగాళ్లు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని ఆటగాళ్లు రోహిత్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మీడియా సమావేశం సందర్భంగా ఫ్యామిలీ విషయంలో కార్యదర్శితో మాట్లాడాలని అగర్కార్‌తో రోహిత్ వ్యాఖ్యానించడం వీడియోలో కనిపించింది. ఈ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మ బీసీసీఐ పెద్దలతో మాట్లాడుతాడా? బీసీసీఐ ఏం చెప్పబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Rohit Sharma to Agarkar “Ab mere ko baithna padega secretary ke saath family ka discuss karne ke liye, sab mere ko bol rahe hai”.
— Cricketopia (@CricketopiaCom) January 18, 2025