హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలు శనివారం(రేపు) ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతాయి. అయితే పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారిని అస్సలు అనుమతించబోరు. అంటే ఉదయం 9:35 గంటల తర్వాత వచ్చే విద్యార్థులను పరీక్షకు అనుమతించబోరు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బడుల్లో 1,582 సెంటర్లు, ప్రైవేట్ బడుల్లో 1,094 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సారి 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు.
పది తరగతి పరీక్షల సందర్భంగా సెల్ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. పరీక్ష కేంద్రాలను ‘నో సెల్‌ఫోన్’ జోన్లుగా ప్రకటించారు. పరీక్ష సిబ్బంది, స్కాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. తనిఖీలకు వచ్చే అధికారులు సైతం సెల్ఫోన్లు తీసుకెళ్లరాదు. వీరు తమ సెల్ఫోన్లను ఆరుబయటే పెట్టాల్సి ఉంటుంది. ఎవరొచ్చినా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించి సెల్ఫోన్లతో విధులకు హాజరైతే వారిని సస్పెండ్‌చేస్తారు. పేపర్ లీకేజీలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు.
పదో తరగతి పరీక్షల్లో ఈ సారి విచిత్ర పరిస్థిత నెలకొన్నది. ముఖ్యంగా డీఈవోలకు కష్టకాలం వచ్చిపడింది. అటు పరీక్షలు జరుగనుండటం, అదే సమయంలో సమాధానపత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండటంతో డోలాయమాన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 14 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగనుండగా, ఏప్రిల్ 1 నుంచి జవాబుపత్రాల మూల్యాంకనం జరుగనున్నది. అటు పరీక్షలను సమన్వయం చేయాల్సి ఉండటం, క్యాంప్‌లను నిర్వహించాల్సి ఉండటంతో డీఈవోలకు తలనొప్పిగా మారనున్నది.