Rohit Sharma | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను టీమిండియా సాధించింది. ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్-2025 సీజన్ సుదీర్ఘంగా కొనసాగనున్నది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో టీమిండియా టెస్ట్ సిరీస్ కోసం పర్యటించనున్నది. ఇంగ్లాండ్ టూర్‌కు రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్‌గా ఉంటాడా? లేదా? అన్న చర్చ సాగుతున్నది. ఇంగ్లాండ్‌తో జూన్ నుంచి మొదలయ్యే సిరీస్‌కు సైతం రోహిత్ కెప్టెన్‌గా కొనసాగే అవకాశాలున్నాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. కానీ, ప్రస్తుతం సెలెక్టర్లు ఇంకా కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోలేదనే వార్త వెలుగులోకి వచ్చింది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ చెత్త ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొన్నాడు. బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో రోహిత్‌ను టీమ్ మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. ఆ తర్వాత రోహిత్ టెస్ట్ క్రికెట్ భవిష్యత్‌పై వాడీవేడిగా చర్చలు సాగాయి.
రోహిత్ నాయకత్వంలోనే న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. తొమ్మిది నెలల్లోనే టీమిండియా వరుసగా రెండో ఐసీసీ టైటిల్ నెగ్గింది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు 2024లో వెస్టిండిస్, అమెరికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ టైటిల్‌ని గెలిచింది. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ మాత్రమేనని.. కానీ, బీసీసీఐలో ఈ విషయంలో ఏకాభిప్రాయం లేదని ఓ జాతీయ మీడియా నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్యగా మారింది. భారత యువ ఆటగాళ్లలో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించే ఆటగాడు లేడని బీసీసీఐ భావిస్తున్నట్లుగా నివేదిక చెప్పింది. ఒత్తిడితో దుబాయిలో బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్‌కు.. ఐసీసీ టైటిల్ విజయంతో భారీ ఊరట దక్కింది.
కానీ, జాతీయ సెలక్షన్ కమిటీ సవాల్‌తో కూడిన టెస్ట్ ఫార్మాట్‌ను నిర్ణయిస్తూ వన్డే ఫార్మాట్లో విజయాన్ని పరిశీలిస్తుందా? అనేది చర్చ నీయాంశంగా మారింది. గత ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ సైకిల్లో భారత జట్టు పరాజయం పాలైంది. కొత్త సైకిల్‌ను టీమిండియా.. ఇంగ్లాండ్ సిరీస్‌తో మొదలవనున్నది. ఇంగ్లాండ్ సిరీస్‌లో తొలి టెస్ట్ లీడ్స్‌లో జరుగనున్నది. సాంకేతికంగా రోహిత్ టెస్ట్ కెప్టెన్ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్‌కు స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. పేలవమైన ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌తో జట్టు ఆడడం కొనసాగించలేమని వివరించే ప్రయత్నించాడు. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ తర్వాత.. భారత్ ఏ టెస్ట్ ఆడలేదు. దాంతో టెస్ట్ కెప్టెన్సీలో ఎలాంటి మార్పు జరుగలేదు. అలాగే, తాను టెస్టు ఆడబోనని రోహిత్ స్వయంగా చెప్పలేదు. ఇంగ్లాండ్ సిరీస్‌పై జాతీయ సెలక్షన్ కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఐపీఎల్ సమయంలో సెలక్షన్ కమిటీకి సెలవులు రానున్నాయి. నిర్దిష్ట వ్యూహం లేకపోతే.. నిర్దిష్ట ఆటగాన్ని దగ్గరగా చూడాలని భావిస్తే మాత్రం సెలక్షన్ కమిటీ సభ్యులు ఐపీఎల్లో పర్యటించరని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఐపీఎల్ ప్రారంభం తర్వాతే ఇంగ్లాండ్ సిరీస్ కోసం బ్లూప్రింట్ తయారు చేయనున్నారు. ఇందులో కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయం ఎలా ఉంటుందనే చర్చనీయాంశంగా మారింది. టెస్టుల తర్వాత వన్డేల్లో రోహిత్ ఫామ్‌లోకి వచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో హాఫ్ సెంచరీతో అలరించాడు. మరి కోచ్ నమ్మకాన్ని పొందుతాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి గంభీర్ జట్టు ప్రయోజనాలమే ముఖ్యమని భావిస్తాడు. రాబోయే మూడు నాలుగేళ్లలో బెస్ట్ టెస్ట్ జట్టును సిద్ధం చేయడంపై ఆసక్తితో ఉన్నాడు. ఈ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం.. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ అంగీకరించాల్సి ఉంటుంది.
Virat Kohli | ఒంటరిగా కూర్చొని విచారించాలా..? బీసీసీఐ కొత్త రూల్స్‌పై విరాట్ కోహ్లీ గుర్రు..!
Virat Kohli | నాకిష్టమైన ఛోలే భటురే గురించి చర్చ ఎందుకు? బ్రాడ్కాస్టర్లపై విరాట్ ఆగ్రహం..!