హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ స్థలంగా పేరొంటూ ప్రైవేట్ వ్యక్తులకు చెందిన స్థలానికి ఫెన్సింగ్ వేసిన హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఫెన్సింగ్ వేసినందునకు బాధిత పిటిషనర్లకు రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించింది. తక్షణం ఫెన్సింగ్ తొలగించాలని, లేనిపక్షంలో అది తొలగించేదాకా రోజుకు రూ.లక్ష చొప్పున పిటిషనర్లకు చెల్లించాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా ఉప్పల్ మండలం మల్లాపూర్‌లో సర్వే నం.100లో బాబానగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ లేఔట్‌లోని రెండు ప్లాట్లకు హైడ్రా కంచె వేయడాన్ని సవాలు చేస్తూ జొన్నలగడ్డ పద్మిని మరొకరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టి వాస్తవాల నిర్ధారణకు అడ్వకేట్ కమిషన్‌ను ఏర్పాటుచేశారు. అడ్వకేట్ కమిషన్ విచారణ జరిపి తమ నివేదికను బుధవారం న్యాయమూర్తికి అందజేశారు. అడ్వకేట్ కమిషనర్ విచారణలో విస్తుగొలిపే అంశాలు బయటపడ్డాయి. పిటిషనర్లు, హైడ్రా వేర్వేరు లేఔట్లు సమర్పించారని, ఒకదానికొకటి పొంత న లేదని పేరొన్నారు. హైడ్రా సమర్పించిన లేఔట్లో పిటిషనర్లకు చెందిన ప్లాట్ నంబర్లు లేకపోవడంతో కంచె వేశారని పేరొన్నారు.
అయితే ఈ స్థలాలకు సంబంధించిన హకులపై పిటిషనర్లు కింది కోర్టును ఆశ్రయించారని, ఇందులో జీహెచ్ఎంసీ ప్రతివాదిగా ఉన్నదని తెలిపారు. విచారణ జరిపిన కింది కోర్టు ఈ ప్లాట్లపై ప్రైవేట్ వ్యక్తులకు హకులున్నాయని ధ్రువీకరిస్తూ, శాశ్వత ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ జీహెచ్ఎంసీ కంచె వేయడానికి అనుమతించిందని తెలిపారు. ఈ నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి హైడ్రా తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వ స్థలాలను రక్షించవద్దని, కంచె వేయవద్దని ఎవరూ చెప్పడంలేదని, అయితే ఆధారాలను ధ్రువీకరించుకొని, బాధితుల వాదనను పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు విరుద్ధంగా ఎవరు ఫిర్యాదు ఇచ్చినా వాస్తవాలను ధ్రువీకరించుకోకుండా ఫెన్సింగ్ వేయడం సరికాదని చెప్పారు. ఫెన్సింగ్ వేయాలంటే సంబంధిత కోర్టు, లేదంటే హైకోర్టు అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. ప్రైవే ట్ స్థలంలో వేసిన కంచెను తక్షణం తొలగించాలని, అంతేగాకుండా పిటిషనర్లకు రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించారు.