Virat Kohli | టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బ్రాడ్కాస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్రాడ్కాస్టర్లపై క్రికెట్ గురించి చర్చించడమని.. తనకు ఇష్టమైన ఛోలే భటురే గురించి చర్చించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. ఓ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ మాట్లాడాడు. విరాట్ ఐపీఎల్లో పాల్గొనేందుకు బెంగళూరుకు వచ్చి ఆర్సీబీతో చేరాడు. విరాట్ అండర్-19 నుంచి వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వస్తున్నాడు. గత పదిహేనేళ్లుగా భారత జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. కోహ్లీ ఆటతో పాటు ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతుంటాడు.
ఇదిలా ఉండగా.. మ్యాచులు జరుగుతున్న సమయంలో బ్రాడ్‌కాస్టర్స్ కోహ్లీ తీసుకునే ఆహారం గురించి చర్చించడం చాలాసార్లు కనిపించింది. చాలా రోజుల తర్వాత ఈ ఏడాది ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. మ్యాచ్ సమయంలో కోహ్లీ చిల్లీ పనీర్ ఆర్డర్ చేశాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలు సైతం ఆ సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బ్రాడ్‌కాస్టర్స్ క్రికెట్‌పై మరింత కవరేజీ అవసరమని.. ఇష్టమైన విషయాల గురించి కాదని కోహ్లీ సూచించాడు. భారత్‌ను క్రీడల్లో అగ్రగామిగా మార్చేందుకు కృషి చేస్తున్నామని.. ఈ విషయంలో తమకు ఓ విజన్ ఉందని తెలిపాడు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పని చేస్తున్నామని.. ఇందులో భాగస్వాములైన ప్రజలందరికీ సమష్టి బాధ్యత ఉండాలని చెప్పాడు. ఇది కేవలం మౌలిక సదుపాయాలు, డబ్బు పెట్టుబడి పెట్టే వ్యక్తుల గురించి మాత్రమే కాదన్నాడు.
మ్యాచ్ ప్రసారం సమయంలో ఆట గురించి మాత్రమే మాట్లాడాలని.. నిన్న మధ్యాహ్న భోజనంలో తిన్నదాని గురించి.. ఢిల్లీలో నాకు ఇష్టమైన ఫుడ్ ఛోలే భటురే గురించి కాదంటూ చురకలంటించాడు. ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో రాణించాడు. ఐదు మ్యాచుల్లో 54.50 సగటుతో 218 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మరో హాఫ్ సెంచరీ ఉన్నది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్‌పై దృష్టి సారించాడు. చాంపియన్స్ ట్రోఫీ తరహాలోనే ఐపీఎల్లో రాణించాలని కోరుకుంటున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ సారి రాయల్స్ చాలెంజర్ బెంగళూరు తరఫున ట్రోఫీని గెలవాలనే కసితో ఉన్నాడు.