ముంబై, ఫిబ్రవరి 25: భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలతో ద్రవ్యోల్బణ భయాలు పెరుగుతున్నా.. మున్ముందు ఆర్బీఐ రెపోరేటు పెరిగేందుకు తక్కువ అవకాశాలే ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ బహిర్గత సభ్యుడు సౌగత భట్టాచార్య అభిప్రాయపడ్డారు. పీటీఐకి ఓ ఈ-మెయిల్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణంతో మెటల్స్, ముడి చమురు ధరలు క్రమేణా పెరుగుతున్నాయని, ఇది వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నదని భట్టాచార్య పేర్కొన్నారు. అయినప్పటికీ రాబోయే ద్రవ్య సమీక్షల్లో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను పెంచకపోవచ్చనే అంచనా వేశారు. నిజానికి భట్టాచార్య, మరో ఐదుగురు ఎంపీసీ సభ్యులు.. ఈ నెల ఆరంభంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపోరేటును 5.25 శాతం వద్దే ఉంచాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
తద్వారా ఆర్బీఐ తమ న్యూట్రల్ పాలసీ వైఖరిని కొనసాగించినైట్టెంది. అంతేగాక మరికొంత కాలం వడ్డీరేట్లు తక్కువ శ్రేణిలోనే ఉండవచ్చన్న సంకేతాలనూ ఇచ్చింది. కాగా, కేంద్ర ప్రభుత్వం పలు రకాల ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నదని, అందుకే దేశ ఆర్థిక వ్యవస్థపై భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం తక్కువగానే ఉంటుందని ఈ సందర్భంగా భట్టాచార్య వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా రెపోరేటును ఆర్బీఐ 125 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే.
2019 నుంచి ఇంతలా కోతపెట్టిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఇక నిరుడు డిసెంబర్ ద్రవ్య సమీక్షలో రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు దించిన ఆర్బీఐ.. అంతకుముందు ఆగస్టు, అక్టోబర్లతోపాటు ఈ నెల (ఫిబ్రవరి) ద్రవ్య సమీక్షల్లో రేట్ల జోలికి వెళ్లలేదు. నిరుడు ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ ద్రవ్య సమీక్షల్లో మాత్రం 100 బేసిస్ పాయింట్లను దించింది. మల్హోత్రాకు ముందు ఆర్బీఐకి సారథ్యం వహించిన శక్తికాంత దాస్.. ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా రెపోరేటును వరుసగా పెంచుకుంటూపోయిన సంగతి విదితమే. అయితే కరోనా సమయంలో దిగాలుపడిన దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్సాహపర్చేందుకు ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను బాగా తగ్గించింది. కానీ ఆ తర్వాత ద్రవ్యోల్బణం విజృంభించడంతో రెపోరేటును పరుగులు పెట్టించింది.