Virat Kohli | బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త రూల్స్‌పై టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఓటమి.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ఘోర పరాజయం నేపథ్యంలో బీసీసీఐ కొత్తగా మార్గదర్శకాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. విదేశీ టూర్ల సమయంలో 45 రోజుల పర్యటన సమయంలో.. అందులో కేవలం రెండువారాలు మాత్రమే ఆటగాళ్ల కుటుంబాలకు అనుమతి ఇవ్వడంపై విరాట్ స్పందించాడు. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న విరాట్ కోహ్లీ.. ఐపీఎల్-2025 సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో చేరాడు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రంలో విరాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఫ్యామిలీ ప్రెజెన్స్ రూల్‌పై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించాడు. కుటుంబంతో సమయం గడపడం ఆటగాళ్లకు చాలా ముఖ్యమని.. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరాడు. దాంతో కష్ట సమయాల్లో ప్లేయర్ల మానసిక స్థితిపై సానుకూల ప్రభావం ఉంటుందని.. ఈ విషయం చాలామందికి తెలియదని.. దీని గురించి కొందరికి వివరించడం కష్టమంటూ బీసీసీఐ రూల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీని గురించి తెలియని వ్యక్తులు కూడా క్రికెటర్ల కుటుంబాలను దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని చెబుతుంటారంటూ అసహనం వ్యక్తం చేశాడు. ‘మీరు మీ కుటుంబాన్ని ఎప్పుడూ వెంటే ఉంచుకోవాలని అనుకుంటున్నారా? అని ఏ ఆటగాడినైనా అడిగితే.. అవును అనే సమాధానం వస్తుంది’ అని విరాట్ పేర్కొన్నారు. ఎందుకంటే తాను ఒంటరిగా గదిలో కూర్చొని విచారంగా ఉండాలనుకోనని స్పష్టం చేశాడు.
తాను సాధారణంగా జీవించాలనుకుంటున్నానని చెప్పాడు. ఆట అనేది ఓ బాధ్యత అని.. వందశాతం దాన్ని పూర్తి చేశానే వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తామని చెప్పాడు. తాను బయటకు వెళ్లినా ఫ్యామిలీతో గడిపే సమయాన్ని.. అవకాశాన్ని వదులుకోనని విరాట్ చెప్పుకొచ్చారు. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ సమయంలో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ సైతం గ్యాలరీలో నుంచి జట్టును ఉత్సాహపరుస్తూ కనిపించింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించిన తర్వాత.. అనుష్కతో కలిసి విరాట్ సంబురాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక సైతం మైదానంలో కనిపించిన విషయం తెలిసిందే.