IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల వయసున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఈ మెగా లీగ్‌లో అరంగేట్రం చేయనున్నాడు. శనివారం లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో మ్యాచ్‌లో వైభవ్ బరిలోకి దిగుతాడని కెప్టెన్ రియాన్ పరాగ్ వెల్లడించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అతిపిన్నవయస్కుడైన ఆటగాడిగా వైభవ్ రికార్డు నెలకొల్పనున్నాడు.
దేశవాళీ క్రికెట్లో సంచనల బ్యాటింగ్‌తో అలరించిన వైభవ్.. ఇక ఐపీఎల్‌లోనూ తన తడాఖా చూపించనున్నాడు. దూకుడుగా ఆడగల ఈ యువకెరటాన్ని రాజస్థాన్ ఫ్రాంచైజీ మెగా వేలంలో రూ. 1.1 కోటికి కొన్న విషయం తెలిసిందే.
HISTORY MADE by Rajasthan Royals and Vaibhav Suryavanshi🙌💗#RRvLSG LIVE 👉 https://t.co/IsM16mvHzB pic.twitter.com/VnSWADKpqw
— ESPNcricinfo (@ESPNcricinfo) April 19, 2025
వైభవ్ 2011లో జన్మించాడు. క్రికెట్‌నే శ్వాసగా భావించిన అతడు 12 ఏళ్లకే రంజీల్లో అడుగుటపెట్టాడు. దాంతో, రంజీల్లో తొలి మ్యాచ్ ఆడిన నాలుగో చిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. 12 ఏండ్ల 284 రోజుల వయసులో పట్నా జట్టు తరఫున బరిలోకి దిగాడు వైభవ్. ఇదివరకూ.. అతిచిన్న వయసులోనే అరంగేట్రం చేసిన రికార్డు అజ్మీర్‌కు చెందిన అలీముద్దీన్(Alimuddin) పేరిట ఉంది. అతడు 12 ఏండ్ల 73 రోజుల వయసులో రంజీల్లో తొలి మ్యాచ్ ఆడాడు. 1942-43 సీజన్లో అతడు రాజ్‌పుతనా జట్టు తరుఫున బరిలోకి దిగాడు.
వైభవ్ రంజీలకు ఎంపికవ్వడంలో అతడి తండ్రి సంజీవ్ సూర్యవంశీ (Sanjiv Suryavanshi) కీలక పాత్ర పోషించాడు. ఐదేండ్ల వయసులోనే వైభవ్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి శిక్షణ ఇప్పించాడు. మొదట్లో సమస్తిపూర్‌లో, ఆ తర్వాత పట్నాలోని అకాడమీలో కొడుకును చేర్పించాడు. పట్నాలో రాటుదేలిన వైభవ్ ఈ మధ్యే కూచ్ బెహర్ ట్రోఫీ(Cooch Behar Trophy)లో బిహార్ తరఫున సత్తా చాటాడు.
జార్ఖండ్‌పై ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ శతకంతో చెలరేగాడు. కేవలం 128 బంతుల్లోనే 22 ఫోర్లు, 3 సిక్సర్లతో 151 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 78 రన్స్‌తో రఫ్ఫాడించాడు. అంతేకాదు నాలుగు జట్ల సిరీస్‌లోనూ దుమ్మురేపాడు. భారత అండర్ 19 ఏ జట్టు, భారత అండర్ 19 బి జట్టు, ఇంగ్లండ్ అండర్ 19, బంగ్లాదేశ్ అండర్ 19 జట్లు పాల్గొన్న ఈ సిరీస్‌లో ఈ చిచ్చరపిడుగు రెండు హాఫ్ సెంచరీలతో ఔరా అనిపించాడు.