Prithvi Shaw : భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఈసారి దేశవాళీ క్రికెట్లో కొత్త జట్టుకు ఆడనున్నాడు. ఈమధ్యే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందుకున్న షా ముంబైతో సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్న షా సోమవారం మహారాష్ట్ర (Maharashtra) టీమ్‌లో చేరాడు. షా రాకను స్వాగతించిన మహరాష్ట్ర క్రికెట్ సంఘం ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టింది. ఈ చిచ్చరపిడుగుకు 100 నంబర్ జెర్సీని కేటాయించింది ఎంసీఏ. ఫస్ట్ క్లాస్‌లో, ఐపీఎల్లో షా అనుభవం తమ జట్టుకు ఎంతో ఉపకరిస్తుందని ఎంసీఏ అధ్యక్షుడు రోహిత్ పవార్ (Rohit Pawar) వెల్లడించాడు. త్వరలో ఆరంభం కానున్న దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర తరఫున షా బరిలోకి దిగనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో చెలరేగి ఆడేందుకు సిద్దమవుతున్నాడీ హిట్టర్.
దేశవాళీలో తన ఆటకు సానబెట్టుకోవడంలో ఎంతో సాయపడిన ముంబై జట్టుrకు షా కృతజ్ఞతలు తెలిపాడు. ‘గత ఏడాది కాలంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. ప్రస్తుతం నా కెరియర్ దృష్ట్యా మహరాష్ట్ర జట్టుతో చేరడం నిజంగా నాకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నా. క్రికెటర్‌గా నేను మరింత మెరుగవుతాననే నమ్మకం ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నాకు పలు అవకాశాలు కల్పించిన ముంబై క్రికెట్ సంఘానికి ధన్యవాదాలు’ అని షా తెలిపాడు.
We are delighted to welcome Prithvi Shaw, India international cricketer and U-19 World Cup-winning captain, to the Maharashtra Cricket Association. His experience and energy will be a valuable addition to our vision for excellence. @PrithviShaw | @RRPSpeaks | #TeamMaha pic.twitter.com/sRhmAXvKdW
— Maharashtra Cricket Association (@MahaCricket) July 7, 2025
దేశవాళీలో రికార్డు స్కోర్లతో అలరించిన షా అంతర్జాతీయంగా రాణించలేకపోయాడు. 58 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 4,556 రన్స్ కొట్టిన ఈ డాషింగ్ బ్యాటర్ భవిష్యత్ స్టార్‌గా ఎదుగుతాడనుకుంటే ఫిట్నెస్ లేమితో, క్రమశిక్షణ కొరవడడంతో జట్టులో చోటు కోల్పోయాడు. దేశవాళీలో గొప్ప ప్రదర్శనతో పునరాగమనం చేయాలనుకున్నా సాధ్యం కాలేదు. పదిహేడో సీజన్ ఐపీఎల్లో దారుణంగా విఫలమైన అతడు పలుమార్లు వివాదాల్లో నిలిచాడు. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్ ఓపెనర్లుగా అవతరించడంతో షాకు దారులు మూసుకుపోయాయి.
పైగా ఫామ్ కూడా లేకపోవడంతో సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టేశారు. నిరుడు ఫిట్నెస్ సమస్యతో అతడు ముంబై తరఫున రంజీ ట్రోఫీలో ఆడలేకపోయాడు. దాంతో, తన కెరీర్ ప్రశ్నార్ధకం అవుతుందని గ్రహించిన షా.. దేశవాళీలో కొత్త జట్టుకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు విన్నవిస్తూ ఎన్ఓసీ ఇవ్వాల్సిందిగా కోరాడు. జూన్ నెలాఖర్లో షాకు ఎన్వోసీ వచ్చింది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మహారాష్ట్ర జట్టుతో కలిశాడు షా.