శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Oct 03, 2020 , 02:16:11

ప్రిక్వార్టర్స్‌లో నాదల్‌, థీమ్‌

ప్రిక్వార్టర్స్‌లో నాదల్‌, థీమ్‌

  • హలెప్‌, స్వితోలినా కూడా.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ 

పారిస్‌: మట్టికోర్టు రారాజు, స్పెయిన్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో దూసుకెళుతున్నాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో రెండో సీడ్‌ నాదల్‌ 6-1, 6-4, 6-0 తేడాతో  స్పెఫానో త్రవాగ్లియా(ఇటలీ)పై గంటా 35 నిమిషాల్లోనే గెలిచి ప్రిక్వార్టర్స్‌ చేరాడు. ఇటీవల యూఎస్‌ ఓపెన్‌ కైవసం చేసుకొని జోరు మీదున్న ఆస్ట్రియా స్టార్‌ డొమెనిక్‌ థీమ్‌ కూడా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మూడో సీడ్‌ థీమ్‌ 6-4, 6-3, 6-1 తేడాతో కాస్పెర్‌ రూడ్‌(నార్వే)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. 2గంటల 15 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో థీమ్‌ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించి ఆరు బ్రేక్‌ పాయింట్లు, 32 విన్నర్లు సాధించాడు. గత రెండేండ్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరి నాదల్‌ చేతిలో ఓడిన థీమ్‌.. ఈసారి సత్తాచాటాలని పట్టుదలగా ఉన్నాడు. కాగా 16వ సీడ్‌ స్టాన్‌ వావ్రింకా(స్విట్జర్లాండ్‌) 6-2, 3-6, 3-6, 6-4, 0-6తేడాతో ఐదు సెట్ల పాటు పోరాడి అన్‌సీడెడ్‌ హుగో గస్టన్‌(ఫ్రెంచ్‌) చేతిలో ఓడిపోయాడు. సెబాస్టిన్‌ కొర్డా, టేలర్‌ ఫ్రిట్జ్‌ కూడా ముందంజ వేశారు. 

హలెప్‌ అలవోకగా.. 

మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో టాప్‌ సీడ్‌ సిమోనా హలెప్‌(రొమేనియా) 6-0, 6-1 తేడాతో అమందా అనిసిమోవా(అమెరికా)పై ఒక గేమ్‌ మాత్రమే కోల్పోయి  ఏకపక్షంగా గెలిచింది. మరో మ్యాచ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ ఎలీనా స్వితోలినా(ఉక్రెయిన్‌) 6-4, 7-5తేడాతో 27వ సీడ్‌ ఎకతెరినా అలెగ్జాండ్రోవా(రష్యా)పై గెలిచింది. ఇగా స్వియాటెక్‌, నాడియా పొడోరోస్కా కూడా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.