IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో అభిమానుల నిరీక్షణ ఫలించనుంది. మేటి బ్యాటర్లను సైతం వణికించే డేంజరస్ పేసర్ మయాంక్ యాదవ్(Mayank Yadav) వచ్చేస్తున్నాడు. గత ఎడిషన్‌లో నిప్పులు చెరిగిన ఈ స్పీడ్‌స్టర్ త్వరలోనే జోరుమీదున్న లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) స్క్వాడ్‌తో కలవనున్నాడు. గాయాల కారణంగా దాదాపు ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరమైన మయాంక్ తాజాగా ఫిట్నెస్ సాధించాడు.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకున్న అతడు బౌలింగ్ ప్రాక్టీస్‌లోనూ మునపటిలా సత్తా చాటాడు. దాంతో, ఏప్రిల్ 15వ తేదిన అతడికి ఎన్సీఏ నిర్వాహకులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(NOC) ఇవ్వనున్నారు. అది రావడమే ఆలస్యం ఈ స్పీడ్‌స్టర్ లక్నో శిబిరంలో చేరడం ఖాయమంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఇంతకుముందే మయాంక్ త్వరలోనే జట్టుతో కలుస్తాడని లక్నో కోచ్ జస్టిన్ లాంగర్ సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
Mayank Yadav is set to rejoin Lucknow Super Giants by Tuesday after recovering from his back and toe injuries. He is expected to be match-fit this week. 🏏#IPL2025 #LSG #MayankYadav pic.twitter.com/qHZ2ZHYzpC
— Sportskeeda (@Sportskeeda) April 14, 2025
కుడిచేతివాటం పేసర్ అయిన మయాంక్ యాదవ్ పదిహేడో సీజన్లో తన పేస్‌తో అదరగొట్టాడు. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు సంధించి వరల్డ్ క్లాస్ బ్యాటర్లకు సైతం చెమటలు పట్టించాడు. 4 మ్యాచుల్లో 7 వికెట్లు తీసి లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత గాయం కారణంగా సీజన్‌కు దూరమయ్యాడు. అయితే.. ఐపీఎల్ ఫామ్‌తో ఆ తర్వాత భారత టీ20 జట్టుకు ఎంపికైన మయాంక్.. అద్భుతంగా రాణించాడు. అయితే.. వెన్నుభాగంలో నొప్పితో ఆరు నెలలు ఆటకు దూరమయ్యాడు.
🚨 Breaking 🚨:
Mayank Yadav is likely to join the LSG squad tomorrow. [Sports Tak]#LSGvsCSK pic.twitter.com/o09NptRbgJ
— ABHI (@AbhishekICT) April 14, 2025
ఎన్సీఏలో నిపుణుల పర్యవేక్షణలో కోలుకున్న అతడు ఈమధ్యే ఫిట్నెస్ సాధించాడు. ఇప్పటికే లక్నో పేసర్లు ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్లు ఫిట్‌గా మారి మైదానంలోకి దిగారు. మయాంక్ సైతం త్వరలోనే ఐపీఎల్ 18వ సీజన్లో తన తడాఖా చూపించనున్నాడు. ఈ ఎడిషన్ కోసం లక్నో.. ఈ పేస్ సంచలనాన్ని రూ.11 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఇప్పటికే ఆల్‌రౌండ్ షోతో.. హ్యాట్రిక్ విక్టరీలతో టాప్ -4లో ఉన్న లక్నో జట్టు మయాంక్ రాకతో మరింత పటిష్టం కానుంది. అప్పుడు పంత్ సేనను ఆపడం కష్టతరమేనని విశ్లేషకులు అంటున్నారు.