నల్లగొండ విద్యావిభాగం (రామగిరి), ఏప్రిల్ 14 : సమూల మార్పునకు నాంది పలికిన మహనీయుల తాత్విక స్పృహ, చైతన్యంతో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఇటికాల పురుషోత్తం అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న మహనీయుల జయంతి ఉత్సవాలకు సోమవారం అంబేద్కర్ జయంతితో ముగింపు పలికారు. కార్యక్రమానికి పురుషోత్తం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాబోవు విద్యా సంవత్సరం నుండి విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించే విధాన మార్పుల దిశగా అడుగులు వేయనున్నట్లు తెలిపారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయ ఆచార్యులు ఇనుకొండ తిరుమలి మాట్లాడుతూ.. పూలే, అంబేద్కర్ పోరాటం అసమానతలు రూపుమాపి ఏక జాతిగా నిలబెట్టేందుకే అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు అడప సత్యనారాయణ మాట్లాడుతూ.. దోపిడీ, వివక్ష, అసమానతలు లేని మానవీయ ఆదర్శ సమాజం కోసం అహర్నిశలు శ్రమించిన పూలే, అంబేద్క్, బాబు జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శమన్నారు.
తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ.. మహనీయుల ఆశయాల సాధనలో హేతుబద్ధ, శాస్త్రీయ దృక్పథంతో తాడిత, పీడిత అట్టడుగు పొరల చారిత్రక వెనుకబాటుపై ప్రశ్నించాలన్నారు. నాలుగు ప్రపంచ విప్లవాల సారం, బౌద్ధ తత్వం నిండిన రాజ్యాంగం ఈ దేశ దిక్సూచిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం సాధనంగా జాతి నిర్మాణం సమగ్రత, సమ్మిళిత సమాజంకై కృషి చేయాలని కోరారు.
అనంతరం ఎంజీయూ ఉప కులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. విద్య మాత్రమే ఖచ్చితమైన ఫలాలను అందించే సాధనంగానూ, విభిన్నతలను గౌరవిస్తూ, ఆరాధిస్తూ పరిపూర్ణ సమాజంగా మార్చగలదని.. మహనీయుల జీవితాలు ఇందుకు సాక్షాలన్నారు. అనంతరం ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 57 మంది విద్యార్థులు, అధ్యాపకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా.అరుణప్రియ, ఉత్సవాల కమిటీ చైర్మన్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, కన్వీనర్ డా.శ్రీదేవి, కళాశాలల ప్రిన్సిపాల్ డా. ప్రేమ్‌సాగర్, సుధారాణి, డీన్ లు ఆచార్య వసంత, ఆచార్య రేఖ, ఆచార్య సరిత, కళ్యాణి, డా.దోమల రమేశ్, సబీనా హెరాల్డ్, డా.వై. ప్రశాంతి పాల్గొన్నారు.
MGU : మహనీయుల తాత్విక చైతన్యంతో భాగస్వాములు కావాలి : ఇటికాల పురుషోత్తం