Kumar Sangakkara : శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర (Kumar Sangakkara) కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఐపీఎల్లో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ (Director Of Cricket)గా హిట్ కొట్టిన ఈ మాజీ క్రికెటర్ ఇంగ్లండ్ (England) జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇంగ్లీష్ టీమ్ వైట్ బాల్ కోచ్‌గా సంగక్కర ఎంపికయ్యాడని సమాచారం. ఈమధ్యే రాజీనామా చేసిన మాథ్యూ మాట్ (Mathew Mot) స్థానంలో సంగక్కర టీ20, వన్డే కోచ్‌గా సేవలందించనున్నాడు. అయితే ఈ విషయాన్ని ఈసీబీ అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
ఇంగ్లండ్‌ను టీ20 చాంపియన్‌గా నిలిపిన మ్యాట్ ఈసారి మ్యాజిక్ చేయలేకపోయాడు. కరీబియన్ గడ్డపై జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో జోస్ బట్లర్ (Jos Buttler) సేన వైఫల్యంతో అతడు కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. అప్పటి నుంచి ఇంగ్లండ్ బోర్డు కొత్త కోచ్ వేటను మొదలెట్టింది.
ఆస్ట్రేలియా దిగ్గజం మైక్ హస్సీ, జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ పేర్లను పరిశీలంచిన ఈసీబీ చివరకు సంగక్కరను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఐపీఎల్లో ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్, జో రూట్లు కొంతకాలంగా రాజస్థాన్‌కు ఆడారు. ఆ సమయంలో వీళ్లు సంగక్కర పనితీరును గమనించారు. కోచ్‌గా సంగక్కర పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఈ ఇద్దరూ ఓకే అని ఉండి ఉంటారు.
లంక మాజీ సారథి అయిన సంగక్కరకు అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రపంచలోని మేటి క్రికెటర్లలో ఒకడైన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఐపీఎల్లో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా తన ముద్ర వేశాడు. 2021లో రాజస్థాన్ రాయల్స్‌తో కొనసాగుతున్న అతడు జట్టును అదే ఏడాది ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అయితే.. 17వ సీజన్లో మాత్రం రాజస్థాన్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో సంగక్కరపై వేటు పడనుందనే వార్తలు వినిపించాయి.